మెరిసేదంతా బంగారం కాదు: వేషాల వెనుక నిజమైన ఆధ్యాత్మికతపై శేషప్ప కవి బోధ

మెరిసేదంతా బంగారం కాదు: వేషాల వెనుక నిజమైన ఆధ్యాత్మికతపై శేషప్ప కవి బోధ
  • జందెమింపుగ వేసి సంధ్య వార్చిననేమి
  • బ్రహ్మకందక కాడు బ్రాహ్మణుండు
  • తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను
  • విష్ణునొందక కాడు వైష్ణవుండు
  • బూదిని నుదుటను బూసికొనిన నేమి
  • శంభు నొందక కాడు శైవ జనుడు
  • కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి
  • యాశ పోవక కాడు యతి వరుండు
  • ఎట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన
  • గురుని జెందక సన్ముక్తి దొరకబోడు
  • భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
  • దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

ఓ నరసింహా! బ్రహ్మజ్ఞానము పొందినవాడే బ్రాహ్మణుడవుతాడే గాని, జంధ్యం ఉన్నంత మాత్రాన కాడు. విష్ణు మహిమ తెలిసినవాడే వైష్ణవుడవుతాడు కాని, నామాలు పెట్టినంత మాత్రాన కానే కాడు, ఈశ్వర మహిమ తెలిసినవాడే శివ భక్తుడవుతాడు గాని, బూడిద పూసుకొనినంత మాత్రాన కానే కాడు. ఆశ విడిచిన వాడే సన్యాసి అవుతాడు గాని, కాషాయ వస్త్రాలు కట్టినంత మాత్రాన కానే కాడు. ఇట్టి మాయా వేషాలు ఎన్ని వేసినా, గురువు బోధలు తెలియకుండా మోక్షం రాదు.. అంటాడు ధర్మపురికి చెందిన శేషప్ప కవి.ఏదైనా మన ఆలోచన, ప్రవర్తనను బట్టే మనకు వర్తిస్తాయని ఈ కవి చెబుతున్నాడు. మెరిసేదంతా బంగారం కాదు అన్న సామెత తెలిసిందే. పైపై మెరుగులు చూసి, భ్రమపడకూడదని పండితులు చెబుతూనే ఉన్నారు.

పరాశర మహర్షికి, ఒక మత్స్యగంధి అంటే చేపలు పట్టే వృత్తిలో ఉన్న సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. ఆయనకు అలవడిన బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణుడయ్యాడు. వ్యాసుని అనుగ్రహంతో ఒక దాసికి పుట్టాడు విదురుడు. ఆయన అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని బోధించే గురువు అయ్యాడు. ఆయన మాటలు విదురనీతిగా ప్రసిద్ధికెక్కాయి. కౌశిక మహర్షికి ధర్మబోధ చేసిన ధర్మవ్యాధుడిని కూడా బ్రాహ్మణునిగానే పరిగణించాలి. కౌశిక మహర్షి తనకు అన్నీ తెలుసుననే అహంకారంతో మెలిగాడు. ఒక స్త్రీ మూర్తి సూచనకు కౌశిక మహర్షి.. మాంసం విక్రయించే ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్లి, ధర్మసూత్రాలు నేర్చుకున్నాడు. అలా ధర్మాన్ని బోధించిన ధర్మవ్యాధుడు బ్రాహ్మణ సమానుడు. ఆయన మాంసం అమ్ముకునే వృత్తి చేసేవారు. ఇటువంటి ఉదాహరణలు భారతరామాయణాలలో అధికంగా కనిపిస్తాయి.

చాలామంది తిరునామాలు తీర్చిదిద్ది, తమను తాము వైష్ణవులుగా ప్రకటించుకుంటారు. వారికి విష్ణుతత్త్వం అంటే ఏమిటో తెలియదు. విష్ణువు అంటే సర్వవ్యాపి అనే అర్థం తెలియక అజ్ఞానంతో, విష్ణువు మాత్రమే భగవంతుడు అని ప్రచారం చేస్తుంటారు. అందువల్ల అటువంటి వారు వైష్ణవులు అనిపించుకోరు. ఆముక్త మాల్యదలో మాలదాసరి కథ సుపరిచితమే. ఒక చేతిలో చిన్న తంబుర మీటుతూ, మరో చేతిలో చిటితాళాన్ని వాయిస్తూ, విష్ణుగానం చేయటం ఆ మాలదాసరి నిత్యకృత్యం. ఆ కారణంగానే ఆయన మహా విష్ణుభక్తుడయ్యాడు. ఆయన చరిత్రను శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో పొందుపరిచారు. అదేవిధంగా శరీరమంతా బూడిద పులుముకున్నప్పటికీ, శివతత్త్వం ఏమిటో తెలియనివాడు శైవుడు కాడు.

చిరుతొండనంబి, భక్త శిరియాళుడు.. వీరంతా శివతత్త్వాన్ని అర్థం చేసుకున్నవారు కనుకనే పరమ శివభక్తులయ్యారు. ఇక కాషాయం కట్టిన సాధువుల విషయానికి వస్తే... చాలామంది శరీరం మీద కాషాయం కడతారే కానీ, మనసులో రేగే కోరికలతో మానసిక సన్యాసం చేయలేకపోతారు. అటువంటి ఆషాఢభూతులు పైకి ఎన్నో కబుర్లు చెబుతూ, తాము మాత్రం ఏ బంధాలనూ విడిచిపెట్టకుండా ఉంటారు. వారిని సన్యాసులుగా పరిగణించకూడదు.

 స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి వంటి మహనీయులు  కాషాయం కట్టకుండానే సన్యసించి, భవబంధాలను త్యజించి, అరిషడ్వర్గాలను జయించి, జ్ఞానబోధ చేశారు. వారిని సన్యాసులుగా భావించాలి.
ఇక గురుబోధ లేకుండా మోక్షం రాదనే విషయం అనుభవం మీద తెలుసుకోవాలి. స్వామి వివేకానందకు రామకృష్ణ పరమహంస గురువులా లభించటం వల్లే ఆయన వివేకాన్ని పొంది వివేకానందుడయ్యాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు గురువుగా గీతా బోధ చేయటం వల్లనే ధర్మబద్ధంగా కురుక్షేత్ర యుద్ధం చేయగలిగాడు.ఇటువంటి కవులు చెప్పిన మాటలలోని ధర్మసూక్ష్మాలను అర్థం చేసుకుని, ఆచరించాలని పెద్దలు చెబుతున్నారు.
- డా. పురాణపండ వైజయంతి