ప్రగతిభవన్‌కు పోనీయరు.. బీఆర్కే భవన్‌కు రానీయరు

ప్రగతిభవన్‌కు పోనీయరు.. బీఆర్కే భవన్‌కు రానీయరు
  • ఏడ పోవాలె!
  • అప్లికేషన్లు తీసుకునే దిక్కు లేదు.. గోస వినే నాథుడు లేడు
  • సీఎం కలువరు, మంత్రులు దొరుకరు.. గేట్ల ముందే జనం పడిగాపులు
  • జిల్లాల నుంచి వచ్చినా సమస్యలు పరిష్కారం కాక తిప్పలు

ఏదైనా సమస్య పరిష్కారం కోసం సీఎంను కలవాలనుకుంటే ప్రగతిభవన్​ గేటు వరకు కూడా పోనివ్వరు. పోనీ మంత్రులను కలుద్దామంటే.. వాళ్లు ఎక్కడ ఉంటరో, ఎప్పుడు ఉంటరో తెలియదు. ఇట్లకాదు, సెక్రటేరియట్​ (బీఆర్కే భవన్​)లో ఆఫీసర్లను కలుద్దామన్నా వీలుకాని పరిస్థితి. రాష్ట్రంలో ప్రజల గోస వినే దిక్కు లేకుండాపోయింది. ఆపతితో వచ్చే వారికి భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. వినతిపత్రాలు ఎవరికి ఇవ్వాలో, ఫిర్యాదులు ఎవరికి చేయాలో, బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్, వెలుగు: ఉన్న సెక్రటేరియట్​ బిల్డింగ్​ను  కూలగొట్టిండ్రు. మంత్రులు, ఆఫీసర్లు తలో దిక్కు అయిండ్రు. సెక్రటేరియట్​ఉన్నప్పుడు మంత్రులను, ఆఫీసర్లను కలవాలన్నా వీలయ్యేది.  ఏ సమస్యలు ఉన్నా వాళ్లకు చెప్పుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు సెక్రటేరియట్​ బిల్డింగే లేదు. మంత్రులు ఎక్కడ ఉంటారో, ఏ టైంలో ఉంటారో ఎవరికీ తెలియని పరిస్థితి. సీఎంను కలవాలంటే ప్రగతిభవన్​కు పోవడం ఒక్కటే మార్గం. కానీ, అక్కడ లీడర్లకు కూడా ఎంట్రీ అంత ఈజీ కాదు. మామూలు జనమైతే గేటు దాకా కూడా పోయే పరిస్థితి లేదు. సెక్రటేరియట్​ను  బీఆర్కే భవన్​లోకి షిఫ్ట్​ చేసిన తర్వాత మామూలు జనం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.  నిజానికి బీఆర్కే భవన్​కు సెక్రటేరియట్​ షిఫ్ట్​ అయినప్పటి నుంచి విజిటర్స్​ను రానివ్వడం లేదు. మొదట్లో ఎమర్జెన్సీ పని ఉన్న కొంత మందిని పంపినా ఇప్పుడు మరింత స్ట్రిక్ట్​ చేశారు.

విజిటింగ్​​ అవర్స్​ ఎత్తివేత

రోజూ వివిధ పనుల కోసం ఆఫీసర్లను కలిసేందుకు సెక్రటేరియట్ కు దాదాపు 500 మంది దాకా జనం వస్తుంటారు. ప్రధానంగా సీఎంఆర్ఎఫ్  చెక్కుల కోసం ఎక్కువగా వస్తుంటారు. సెక్రటేరియట్ బిల్డింగ్​ షిఫ్టింగ్ కంటే ముందు వరకు మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5  గంటల దాకా విజిటింగ్​​ అవర్స్ ఉండేవి. విజిటర్స్​ నుంచి ఆధార్ నంబర్ తీసుకుని లోపలికి అనుమతిచ్చేవారు. ఆయా శాఖల సెక్రటరీలను విజిటర్స్​ కలిసి తమ సమస్యలు చెప్పి, వినతి పత్రాలు అందజేసేవారు. సెక్రటరీలు కూడా విజిటింగ్ అవర్స్ లో అందుబాటులో ఉండేవారు. కానీ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం 2019 అక్టోబర్​లో సెక్రటేరియట్​లోని మెజార్టీ శాఖలను పక్కనే ఉన్న బీఆర్కే భవన్​లోకి షిఫ్ట్​ చేశారు. అప్పటి నుంచి విజిటింగ్​ అవర్స్​ ఎత్తేశారు. షిఫ్టింగ్ పూర్తయ్యే వరకు విజిటింగ్​  అవర్స్  లేవని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ షిఫ్టింగ్ పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా బీఆర్కే భవన్​లోకి మాత్రం విజిటర్స్ ను రానివ్వడం లేదు.  సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విజిటింగ్​ అవర్స్ ను  ఎత్తేసినట్లు ఓ సీనియర్ ఐఏఎస్  ఆఫీసర్​ చెప్పారు.

తెలిసిన ఆఫీసర్​ ఉంటే.. అదీ ఫోన్​ చేస్తేనే..

సెక్రటేరియట్ లోకి వెళ్లాలంటే అంత ఈజీ కాదు. లోపల పనిచేసే ఆఫీసర్లు తెలిసి ఉండాలి. వారు ఎస్పీఎఫ్ పోలీసులకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని పంపండని చెప్తేనే అనుమతి ఇస్తారు. కొన్ని సార్లు రాతపూర్వకంగా రాసి ఇస్తేనే పంపుతున్నారు. లేకపోతే ఎంత వేడుకున్నా లోపలికి రానివ్వడం లేదు. అత్యవసర పని ఉందని చెప్పినా వినడం లేదు. ‘‘పై నుంచి ఎవరైనా ఆఫీసర్లు ఫోన్​ చేసి చెప్తేనే లోపలికి పంపిస్తాం. అట్ల కాదని ఎవరినైనా పంపితే మాపై యాక్షన్​ ఉంటుంది’’ అని ఎస్పీఎఫ్  పోలీసులు అంటున్నారు.

గోస వినేటోళ్లే లేరు

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంను కలిసేందుకు ప్రజలకు అనుమతి లేదు. మినిస్టర్లను కలిసి గోడు వెళ్లబోసుకుందామంటే వారు ఎక్కడ ఉంటారో తెలియదు. ఒక వేళ కలిసినా వెంటనే పని కావడం లేదు. వినతి పత్రాలు తీసుకొని పని చేస్తామని వెనక్కి పంపుతున్నారు. మళ్లీ కలిసి పని కాలేదని గుర్తు చేస్తే.. సెక్రటేరియట్ కు వెళ్లండని మంత్రులు చెప్తున్నట్లు బాధితులు అంటున్నారు. దీంతో సెక్రటేరియట్ కు వెళ్తే.. అక్కడ లోపలికి అనుమతించడం లేదు. జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కాని పనులు సెక్రటరీలతో  అవుతాయన్న నమ్మకంతో బాధితులు సెక్రటేరియట్ కు వస్తుంటారు. ఎంతో ఆశతో వస్తున్న తమను లోపలికి పంపడం లేదని, ఆఫీసర్లను కలువనివ్వడం లేదని విజిటర్స్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లయితే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని గోడు వెళ్లబోసుకుంటున్నారు.

కరోనా రూల్స్ బీఆర్కే భవన్​కేనా?

అన్​లాక్​తో దాదాపు  అన్ని సెక్టార్లు తెర్చుకున్నాయి. సినిమా టాకీసులకు కూడా వంద శాతం సీట్లకు పర్మిషన్​ ఇచ్చారు.  కానీ  టెంపరరీ సెక్రటేరియట్  బీఆర్కే భవన్​లో ఎంట్రీకి  మాత్రం కరోనా రూల్స్ ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. కరోనా రూల్స్ మేరకు విజిటర్స్​ను రానివ్వడం లేదని అంటున్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం అవస్థలు

సీఎంఆర్ఎఫ్  చెక్కుల కోసం సెక్రటేరియట్ కు రోజూ 100 మంది వస్తుంటారు. కొందరు చెక్ డ్యూ డేట్ దాటిందని, మరికొందరు చెక్ పై పేరు తప్పుగా పడిందని ఆఫీసర్లను కలిసేందుకు వస్తుంటారు. సెక్రటేరియట్​లోని చెక్ లు ఇచ్చే రెవెన్యూ శాఖ సెక్షన్ కు వెళ్లడం పెద్ద చాలెంజ్ గా మారింది. ఆ సెక్షన్ నుంచి ఎవరైనా ఆఫీసర్లు ఫోన్ చేస్తేనే లోపలికి పంపుతామని సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. ఆఫీసర్లు తమకు తెలియదని, అర్జెంట్​గా కలవాలని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. దీంతో బాధితులు పని పూర్తి చేసుకునేందుకు చోటామోటా లీడర్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఎంతో కొంత తీసుకుని పనిచేసిపెడ్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ప్రగతిభవన్ బాటలోనే బీఆర్కే భవన్​

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు ప్రజలను నేరుగా కలిసేవారు. వారి సమస్యలను విని వినతిపత్రాలు తీసుకునే వారు. సాధ్యమయ్యే పనులు పూర్తి చేసి, వారికి సమాచారం ఇచ్చేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సాధారణ ప్రజలు సీఎంను కలిసే చాన్స్ లేకుండా పోయింది. ప్రగతిభవన్ లోకి సీఎం షిఫ్ట్​ అయ్యాక.. అందులోకి వెళ్లడం లీడర్లకే ఒక కలగా మారింది. సాధారణ ప్రజల పరిస్థితి అయితే.. బయట్నించి చూడటం తప్ప లోపలికి వెళ్లి సీఎంను కలిసి తమ సమస్యలను వివరించే చాన్స్ లేదు. ప్రగతిభవన్ చుట్టూ అనుక్షణం నిఘా వర్గాల కదలికలతోపాటు, సీసీ కెమెరాల్లో భద్రత పర్యవేక్షణ ఉంటుంది. ఏడాదిన్నరగా బీఆర్కే భవన్​లోకి కూడా  ప్రగతిభవన్ తరహాలోనే విజిటర్స్ ను రానివ్వడం లేదు. చుట్టూ మఫ్టీలో పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. దాదాపు 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితిని ఫస్ట్​టైమ్​ చూస్తున్న

సెక్రటేరియట్​లో విజిటింగ్​ అవర్స్​ ను తీసేయడం నా సర్వీస్​లో ఫస్ట్ టైం చూస్తున్న. నేను జిల్లాలో పనిచేసినప్పుడు పరిచయం ఉన్న ఓ రైతుకు ఇప్పుడు రైతు బంధు వస్తలేదు. పట్టాలో తక్కువ భూమి పడింది. ఆ పనికోసం రైతు నన్ను కలిసేందుకు సెక్రటేరియట్ కు వస్తే సెక్యూరిటీకి ఫోన్​ చేసి లోపలికి పంపించాలని చెప్పిన. నాకు ఆ రైతు తెలుసు కాబట్టి లోపలికి అనుమతిచ్చిన్రు. ఇక లోపల ఆఫీసర్లతో ఎలాంటి పరిచయం లేని ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
– ఇదీ సెక్రటేరియట్​లోని ఓ సీనియర్ ఐఏఎస్  ఆఫీసర్​ అభిప్రాయం

గేటు కాడ్నే ఆపేసిన్రు

నా భూమిని సర్పంచ్ అనుచరులు కబ్జా చేసిన్రు. దీనిపై కలెక్టర్ ను, మంత్రి కేటీఆర్​ను  కలిసిన. సర్వే చేయించి పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖకు అప్లయ్ చేసుకున్న. సెక్రటేరియట్ లోని రెవెన్యూ శాఖకు వెళ్తే పని అవుతుందని స్థానిక ఆఫీసర్లు చెప్తే వచ్చిన. కానీ లోపలికి పోనిస్తలేరు. గేటు కాడ్నే పోలీసులు ఆపేసిన్రు.

– ఇదీ శనివారం బీఆర్కే భవన్​కు వచ్చిన సిరిసిల్ల జిల్లాకు చెందిన వెంకటేశ్​రెడ్డి ఆవేదన