ఇప్పటికిప్పుడు చైనా ప్రొడక్ట్స్ బాయ్‌కాట్ చేయడం మనం మాట్లాడుకునేంత ఈజీ కాదు. డ్రాగన్‌ను నిందించేందుకు వెంటనే సిద్ధపడితే, మన కస్టమర్లు నష్టపోవల్సి వస్తుంది. ఎందుకంటే చైనా ప్రొడక్ట్స్ అన్నీ చాలా చవుకగా దొరికేవే. అవే ప్రొడక్ట్స్‌ను ఇండియాలో తయారు చేసినా, కచ్చితంగా ధరలు ఎక్కువగానే ఉంటాయి. అంటే, ఇక్కడి కస్టమర్లు ఎక్కువ రేట్లకే కొనుక్కోవాల్సి వస్తుందన్న మాట. చైనా మీద ఆధారపడటం తగ్గించుకోవాలనే ఆలోచన మంచిదే. దానికి సరైన ప్లానింగ్, విధానాలు, వాటి అమలు చాలా కీలకమవుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు.ఇండియాలో తీసుకువస్తున్న భారీ సంస్కరణలతో ఫార్మా నుంచి మొబైల్స్, ఆటో పార్టుల దాకా వివిధ రంగాలలో దేశీయ పరిశ్రమ ఎదిగే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి కొన్నేళ్ల టైము పడుతుంది.
బార్డర్లో చైనా దూకుడుకు ప్రతిగా ఆ దేశంతో ఎకనమిక్ సంబంధాలను మనం తెంచుకోవాలనుకుంటే, అదంత సులభమేమీ కాదు. బార్డర్లో డిస్టర్బెన్స్‌తో బీజింగ్‌పై దేశంలో వ్యతిరేకత పెరిగిన మాట నిజమే. దీంతో చైనా ప్రొడక్ట్స్‌ను బ్యాన్ చేయాలనే స్లోగన్ మరోసారి ఊపందుకుంది. కాకపోతే, వాస్తవాలు చూస్తే మరోలా ఉన్నాయి. చైనా ప్రొడక్ట్స్‌పై మన దేశంలోని కన్స్యూమర్లే కాకుండా, మన పరిశ్రమలు కూడా చాలా ఎక్కువగానే ఆధారపడుతున్నాయి. కాబట్టి, ఈ స్లోగన్స్ నిజమవడం కొంచెం కష్టమేనంటున్నారు ఎనలిస్టులు.
చైనా చవుక ప్రొడక్ట్స్‌ను ఇండియన్స్ కొనకుండా నిరుత్సాహపరిచేలా విధానాలు తీసుకువస్తే, షార్ట్ టర్మ్‌లో ఆయా వస్తువులకు కన్స్యూమర్లు ఎక్కువ ధరలు పెట్టాల్సి వస్తుంది. కరోనా వైరస్ రాకతో యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ) ధరలు ఈ ఏడాది జనవరి మొదటి నుంచి ఇప్పటిదాకా చూస్తే, ఆరు నుంచి 167 శాతం దాకా పెరిగాయి. ఇందులో నిమ్స్‌లైడ్ రేటు బాగా ఎక్కువగా పెరిగింది. చైనా నుంచి సప్లై తగ్గిపోవడమే ఈ ఏపీఐల రేట్లు పెరగడానికి కారణం.
బార్డర్లో 20 మంది ఇండియా సైనికులు చనిపోయినా, చైనా ప్రొడక్ట్స్‌ను వేటినీ ప్రభుత్వం ఇంకా నిషేధించలేదు. కాకపోతే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సెయిట్) వంటి సంస్థలు వాటిని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇండియా ఎలక్ట్రానిక్స్ దిగుమతుల్లో 45 శాతం చైనా నుంచే వస్తున్నాయి. కొన్ని మొబైల్ కాంపోనెంట్సైతే ఏకంగా 90 శాతం అక్కడి నుంచే దిగుమతి అవుతున్నాయి. యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్‌లో 65–70 శాతం మనం చైనా నుంచే కొంటున్నాం. ఆటోమోటివ్ పార్ట్స్, ఫెర్టిలైజర్స్‌లో నాలుగో వంతును చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కోవిడ్–19 సందర్భంగా ఫిబ్రవరిలో సీఐఐ రూపొందించిన నోట్ ఈ డేటాను వెల్లడిస్తోంది. ఇండియా అత్యధికంగా ప్రొడక్ట్స్‌ను చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఫైనాన్షియల్ ఇయర్ 2019–20 మొదటి పద కొండు నెలల్లో చూస్తే ఆ దేశపు ట్రేడ్ సర్‌ప్లస్ కూడా ఏకంగా 47 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియా మొబైల్ ఫోన్ మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లయితే, ఇందులో 72 శాతం వాటా చైనా కంపెనీలదే. షవోమి వంటి చైనా బ్రాండ్లే ఇండియా మార్కెట్లో అధిపత్యం చూపిస్తున్నాయి. కొన్ని చైనా కంపెనీలు, మరికొన్ని ఇండియా కంపెనీలు మొబైల్ ఫోన్స్‌ను ఇక్కడ అసెంబుల్ చేస్తున్నా, కాంపోనెంట్స్‌ను మాత్రం చైనా నుంచే దిగుమతి చేసుకోవడం విశేషం. మన టెలికం ఎక్విప్‌మెంట్ మార్కెట్లో చైనా వాటా 25 శాతం. ఈ విభాగంలో చాలా అమెరికా, యూరప్ కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతో చైనా ప్రొడక్ట్స్‌ను బ్యాన్ చేయడం సాధ్యమే అయినా, టెలికం ఆపరేటర్లకు కనీసం 15 శాతం ఖర్చు పెరుగుతుంది. చైనా వెండార్లు ఇండియా ఆపరేటర్లకు ఇస్తున్న ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ సదుపాయమూ పోతుంది. ఇండియా స్మార్ట్ టీవీ మార్కెట్లోనూ 45 శాతం వాటాను చైనా చేజిక్కించుకుంది. ప్రత్యర్ధులతో పోలిస్తే చైనా ప్రొడక్ట్స్ ధరలు 30 నుంచి 50 శాతం తక్కువ. స్ట్రక్చరల్ రిఫార్మ్స్‌తోపాటు, విధానపరమైన జోక్యంతో ఫార్మా నుంచి మొబైల్స్, ఆటో పార్ట్స్ దాకా ఇండియాలో కెపాసిటీ పెంచాలన్నా, కొన్నేళ్లలోనే సాధ్యపడుతుంది. చైనా దిగుమతులను వెంటనే ఆపేయాలంటే వీలు పడదని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా చెప్పారు. ఐతే, ఇండియాలో అదే వ్యాల్యూ చెయిన్‌ను మనం ఏర్పాటు చేసుకోలగలమని తెలిపారు. ఇండియాలోని స్కిల్స్, క్వాలిటీ వల్ల ఇది సాధ్యమవుతుందని అన్నారు. దాంతో చైనా మీద ఆధారపడటం క్రమంగా తగ్గిపోతుందని చెప్పారు. ఇండియా ఆటో పార్ట్స్ దిగుమతులు ప్రస్తుతం 18 బిలియన్ డాలర్ల దాకా ఉంటున్నాయి. ఈ విభాగంలో ఇండియా నుంచి చైనాకు ఎగుమతులు చూస్తే ఏటా కేవలం 300 మిలియన్ డాలర్లు. చైనా అధిపత్యం వివిధ రంగాలలో తగ్గించాలంటే వెంటనే సాధ్యపడదని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నేళ్లపాటు మనం చొరవ తీసుకుని, సామర్ధ్యాన్ని భారీగా పెంచుకున్నప్పుడే అది వీలవుతుందని పేర్కొంటున్నారు.

