హార్మూజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా హెలికాప్టర్.. పైలెట్లను రక్షించిన అమెరికా సైన్యం

హార్మూజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా హెలికాప్టర్.. పైలెట్లను రక్షించిన అమెరికా సైన్యం

టెహ్రాన్: హార్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్ కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లోని ఇద్దరు సిబ్బంది (పైలట్లు) సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ ప్రమాదంపై స్పందించారు. ‘పైలట్లు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై మేము రేపు ఒక పూర్తి నివేదికను విడుదల చేయబోతున్నాం" అని ఆయన పేర్కొన్నారు. 

యుద్ధం కారణంగా ఇరాన్ ప్రస్తుతం ఈ  జలమార్గాన్ని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ను ఇరాన్ దళాలు కాల్చివేశాయా? ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? లేదా మరేదైనా ఇతర సమస్య కారణమా? అనేది ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. కానీ, ఎలాంటి అదనపు వివరాలను వెల్లడించలేదు. అలాగే, అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్, రక్షణ శాఖ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. 

ఇరాన్-, ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సోమవారం ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీగా దాడులు చేసుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమ ఆసియా తీవ్ర ఉద్రిక్తతలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇరాన్ ముడి చమురు రవాణాను, ట్యాంకర్లను అడ్డుకుంటూ.. చర్చల కోసం టెహ్రాన్ పై ఒత్తిడి తీసుకురావడంలో అమెరికా సైన్యానికి ఈ అపాచీ హెలికాప్టర్లు అత్యంత కీలకమైన ఆయుధంగా మారాయి. అంతేకాకుండా, ఈ యుద్ధ సమయంలో ఇరాన్ డ్రోన్లను కూల్చివేయడానికి యూఏఈ కూడా ఈ రకమైన హెలికాప్టర్లను ఉపయోగించింది.