హెచ్1బీ వీసా ఫీజు రద్దు.. అమెరికాకు తీవ్ర నష్టం...జడ్జిలది పిచ్చి చర్య.. అమెరికన్లకు కష్టాలు తెస్తున్నారు: ట్రంప్   

హెచ్1బీ వీసా ఫీజు రద్దు.. అమెరికాకు తీవ్ర నష్టం...జడ్జిలది పిచ్చి చర్య.. అమెరికన్లకు కష్టాలు తెస్తున్నారు: ట్రంప్   
  • ఫెడరల్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేయనున్నట్టు వైట్ హౌస్ వెల్లడి 

వాషింగ్టన్: హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు నిర్ణయించిన లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టివేయడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు దేశాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయన్నారు. మంగళవారం న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌‌‌‌‌‌‌‌లో ఎన్బీఏ ఫైనల్స్ వీక్షించిన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ న్యాయమూర్తులు మాకు నిజంగా చాలా కష్టమైన పరిస్థితులను సృష్టిస్తున్నారు. ఇది నిజంగా పిచ్చి చర్య. వారు మాకు అత్యంత కష్టకాలాన్ని తెస్తున్నారు. మన దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు” అని ఆయన విమర్శించారు. విదేశాలకు చెందిన హైస్కిల్డ్ ఉద్యోగులను అమెరికన్ కంపెనీలు నియమించుకోవడానికి ఉద్దేశించిన హెచ్1బీ వీసాలపై దరఖాస్తు ఫీజును ట్రంప్ గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో లక్ష డాలర్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కాలిఫోర్నియాతో పాటు మరో 19 రాష్ట్రాలు ఈ రుసుమును సవాలు చేస్తూ మసాచూసెట్స్​లోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. 

దీనిపై విచారించిన ఫెడరల్ జడ్జి లియో సోరోకిన్ సోమవారం తీర్పు చెప్పారు. హెచ్-1బీ దరఖాస్తుల కోసం ట్రంప్ విధించిన లక్ష డాలర్ల రుసుముకు కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ఆమోదం లేనందున, అది చట్టవిరుద్ధమని కొట్టివేశారు. అయితే, ఫెడరల్ కోర్టు తీర్పును అప్పీలేట్ కోర్టులో సవాలు చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి  టేలర్ రోజర్స్ చెప్పారు. ‘వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఇప్పటికే దాదాపు ఇలాంటి ఆదేశాన్నే సమర్థించారు. అప్పీల్‌‌‌‌‌‌‌‌లో ఈ తాజా తీర్పు ఖచ్చితంగా రివర్స్ అవుతుందని ప్రభుత్వం ధీమాగా ఉంది’ అని పేర్కొన్నారు.

తీర్పుపై ఇండో-అమెరికన్ సంస్థల హర్షం

హెచ్-1బీ వీసా దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల రుసుమును కొట్టివేస్తూ ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమెరికాలోని ప్రవాస భారతీయ సంస్థలు స్వాగతించాయి. ఉపాధి ఆధారిత వలస విధానానికి ఇది ఒక సరైన, న్యాయబద్ధమైన నిర్ణయమని హర్షం వ్యక్తం చేశాయి. ‘‘లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా రుసుమును కొట్టివేస్తూ మసాచూసెట్స్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇది ఉపాధి ఆధారిత వలస విధానంలో నిలకడను, న్యాయాన్ని పునరుద్ధరిస్తుంది” అని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) పాలసీ అండ్ స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ కండ్ ‘పీటీఐ’తో చెప్పారు. 

ఆవిష్కరణలు, పరిశోధనలు, వ్యవస్థాపకతలో అమెరికా తన పోటీతత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ కోర్టు తీర్పు చాలా సముచితమైనదని అన్నారు. ‘‘కోర్టు ఉత్తర్వుల తర్వాత హెచ్-1బీ వీసాలతో సంబంధం ఉన్న స్టేక్‌‌‌‌‌‌‌‌హోల్డర్లందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఈ వ్యవహారం నిజంగా ఇంతటితో ముగిసిందా అనేది ఆలోచించాల్సిన విషయమే’’ అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.