సర్కారు మాటలు లెక్కజేస్తలేరు

సర్కారు మాటలు లెక్కజేస్తలేరు
  • మిల్లర్ల దోపిడీ వాస్తవమే
  • తరుగు దోపిడీపై అడిషనల్ ​కలెక్టర్​కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిర్యాదు

జగిత్యాల, వెలుగు: మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని, సర్కారు మాటలు లెక్కచేయకుండా బస్తాకు మూడు కిలోల దాకా కట్​చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్​ అయ్యారు. మిల్లర్ల దోపిడీపై ఇటీవల ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి చేసిన ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం డీఎస్పీ ప్రకాశ్​తో కలిసి జగిత్యాల కలెక్టరేట్ కు వెళ్లిన సంజయ్, వడ్ల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీలతకు ఫిర్యాదు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, సివిల్ సప్లై అధికారులు, వడ్ల కొనుగోళ్లలో ఎలాంటి కోతలు పెట్టవద్దని మిల్లర్ల అసోసియేషన్ ను హెచ్చరించినా దోపిడీ ఆగడం లేదన్నారు. రైతులను మోసం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయాలని అడిషనల్ కలెక్టర్ కు సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే సంజయ్​మీడియాతో మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేయడంతో సీఎం కేసీఆర్ కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకుంటున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రైస్ మిల్లర్లు కొన్ని చోట్ల బస్తాకు రెండు కిలోలు, మూడు కిలోలు కోత విధిస్తున్న విషయం వాస్తమేనని, ఈ విషయంలో ప్రతిపక్ష నేత జీవన్​రెడ్డి చేసిన వాఖ్యలతో తాను ఏకీభవిస్తానన్నారు. మిల్లర్లు దొపిడీ చేయడం, ఆఫీసర్లు వాళ్లకు సపోర్ట్ చేయడం వాస్తవమేనన్నారు. కాగా, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సీఎం కేసీఆర్, కేటీఆర్​పై చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. రైతుల సమస్యలపై విమర్శించడం మాని, పరిష్కారానికి కృషి చేయాలని, ఇందుకోసం స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా వచ్చేందుకు తాను సిద్ధమన్నారు.