సిటీలో ఏ టైమ్​లో నీళ్లొస్తయో తెలియక తెల్లవారుజాము వరకు పడిగాపులు

సిటీలో ఏ టైమ్​లో నీళ్లొస్తయో తెలియక తెల్లవారుజాము వరకు పడిగాపులు

హైదరాబాద్​, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో నీటి కోసం జనం అర్ధరాత్రి వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది. వాటర్​బోర్డ్ పరిధిలోని దాదాపు 500కు పైగా కాలనీలను ఇదే సమస్య వెంటాడుతోంది. కేవలం లీడర్లు, అధికారులు ఉంటున్న ప్రాంతాలతో పాటు మిగతా కొన్నింటిపై మాత్రమే అధికారులు ఫోకస్​పెడుతూ.. మురికి వాడలు, బస్తీల్లో నీటి సరఫరాను పెద్దగా పట్టించుకోవడం లేదు. స్లమ్స్, బస్తీల్లో రాత్రి సమయాల్లో నీటిని వదులుతున్నారు. అదీ ఒక్కో రోజు ఒక్కో టైమ్​లో సప్లయ్ అవుతుండటంతో జనం నీటి కోసం రాత్రి వేళల్లో పడిగాపులు కాస్తున్నారు. మరుసటి రోజు డ్యూటీలు, ఇతర పనులకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు.

ఒకే టైమ్​లో ఇవ్వాలని..

లంగర్​హౌస్, జహనుమా, అంబర్ పేట, మౌలాలి, గచ్చిబౌలి, మన్సూరాబాద్, జియాగూడ, యాకుత్ పురా, గౌరీశంకర్ కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సప్లయ్​కు టైమింగ్ పాటించడం లేదు. ఎప్పుడు నీళ్లు వస్తయో తెలియక కాలనీల వాసులు నల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక రోజు రాత్రి 10, 11 గంటలకు సప్లయ్ అయితే మరో రోజు అర్ధరాత్రి 1, 2 గంటలకు నీళ్లు ఇస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల నుంచి వాటర్​బోర్డుకు వరుసగా ఫిర్యాదులు వెళ్తున్నాయి. సాయంత్రం లేదా తెల్లవారు జామున నీటిని సప్లయ్ చేయాలని లేదా కనీసం ఏదో ఒక సమయాన్ని తమకు కేటాయించాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం ఈ ఫిర్యాదులపై స్పందించడం లేదు. సప్లయ్ టైమింగ్​లో మార్పులు చేయడం లేదు.

కొన్ని కాలనీలపైనే ఫోకస్

లీడర్లు, అధికారులు ఉంటున్న ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా నీటి సప్లయ్ చేస్తే..  తమకు సమస్య ఉండదని వాటర్​బోర్డు ​సిబ్బంది భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అధికారులు సైతం ఈ ప్రాంతాలపైనే ఫోకస్ పెడుతున్నారు. లీడర్లు, ఆఫీసర్లు ఉండే ప్రాంతాల్లో డే టైమ్​లో నీళ్లు  వస్తుండగా.. సమీప బస్తీల్లో మాత్రం రాత్రి వేళల్లో సరఫరా చేస్తున్నారు. అన్ని డివిజన్లలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నీటి కోసం అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉంటుండటంతో పొద్దున డ్యూటీకి, కూలీ పనులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని అక్కడి జనంలు పేర్కొంటున్నారు. తమ సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

ఎన్నిసార్లు చెప్పినా 

మా కాలనీలో అర్ధరాత్రి నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో నీళ్ల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఉదయం డ్యూటీలకు వెళ్లేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి సప్లై చేయకుండా డే టైమ్ లో చేయాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదు. –కురాకుల కృష్ణ, ఏకలవ్య నగర్, కార్వాన్