Prithvi Shaw: నా లక్ష్యం టీమిండియా కాదు.. ముంబైయే: పృథ్వీ షా

Prithvi Shaw: నా లక్ష్యం టీమిండియా కాదు.. ముంబైయే: పృథ్వీ షా

ఓవైపు గాయాలు.. మరోవైపు ఫామ్ కోల్పోయి పరుగుల చేయలేక అవస్థలు.. ఇంకోవైపు సోషల్ మీడియా మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో గొడవలు.. కొన్నాళ్లక్రితం వరకూ భారత యువ కెరటం పృథ్వీ షా పడిన  కష్టాలివి. ఎట్టకేలకు షాకు వీటి నుంచి విముక్తి లభించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆరోపణలు నిరాధారమైనవని తేలగా.. షా రంజీ ట్రోఫీలో అద్భుతమైన సెంచరీతో తన పునరాగమనాన్ని చాటుకున్నాడు. 

ముంబై జట్టుకు ఆడుతున్న పృథ్వీ షా.. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో భారీ శతకం బాదాడు. 185 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 159 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత జట్టుకు తన పునరాగమనంపై ప్రశ్నించగా.. అలాంటి దూరపు ఆలోచనలు లేవని తెలిపాడు. ప్రస్తుతానికి ముంబై జట్టుకు రంజీ ట్రోఫీ అందించడంపైనే తాను దృష్టిసారించినట్లు వెల్లడించాడు. 

"నేను భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు.. వర్తమానంపై దృష్టి పెడుతున్నా.. గాయం తర్వాత మళ్లీ క్రికెట్ వాడుతుండటం సంతోషంగా ఉంది. ముంబై జట్టు రంజీ ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో ఆడుతున్నా. ఆ లక్ష్యం కోసం నేను చేయగలిగినత చేస్తాను.." అని షా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

వన్డే ప్రపంచ కప్‌కు ఎంపిక కాకపోవడంతో ఇంగ్లాండ్ వెళ్లిన షా అక్కడ అదరగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్‌ జట్టు తరుపున 4 మ్యాచ్‌ల్లో 143 సగటుతో 429 పరుగులు చేశాడు. సోమర్‌సెట్‌పై ఏకంగా 244 పరుగులు చేశాడు. అలా భీకర ఫామ్‌లో ఉండగానే మోకాలికి గాయమైంది. దీంతో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఒకప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా ప్రశంసించబడిన షా, మళ్లీ ఆ ఫామ్ అందుకొని జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని  భారత అభిమానులు ఆశిస్తున్నారు.