అయోధ్య రామాలయ నిర్మాణంలో ఇనుము.. సిమెంట్ లేదు.. మరి ఎలా కట్టారంటే...

అయోధ్య రామాలయ నిర్మాణంలో ఇనుము.. సిమెంట్ లేదు.. మరి ఎలా కట్టారంటే...

దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రామ్‌లల్లా నూతన రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నూతన రామాలయాన్ని అత్యంత సుందరంగా, అంతకుమించిన వైభవోపేతంగా నిర్మించారు.  ఈ రామాలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ అస్సలు ఉపయోగించేలేదంటే మీరు నమ్ముతారా? అవి లేకుండా ఇంత భారీ ఆలయం ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

అయోధ్యలోని రామాలయాన్ని ప్రత్యేకమైన రాళ్లతో నిర్మించారు. దీని నిర్మాణంలో ఉపయోగించే ప్రతి రాయికి ఒక గాడిని తయారు చేసి.. అదే చోట మరో రాయి అమరిపోయేలా ఆ గాడిలో అమర్చారు. ఈ విధంగా రామ మందిరంలో ఉపయోగించే రాళ్లన్నీ సిమెంట్ లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. 

అయోధ్య ఆలయ ప్రధాన నిర్మాణం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని బన్సీ పహర్‌పూర్ నుండి తెచ్చిన గులాబీ రాయితో నిర్మితమయ్యింది. ఈ గులాబీ రాయి బలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాళ్లతోనే ఆలయం అంతటినీ నిర్మించారు. ఎక్కడా కూడా ఇనుము, సిమెంటు ఉపయోగించలేదు. 

ఆలయ నిర్మాణ పునాదిలో కూడా ఇనుము, సిమెంట్,  ఉక్కు ఉపయోగించలేదని ఆలయ నిర్మాణం గురించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్  తెలిపారు.   ఆలయ పునాదుల కోసం భూసార పరీక్షలు ప్రారంభించినప్పుడు, ఆ ప్రదేశంలో వదులుగా ఉన్న ఇసుక మాత్రమే ఉందని, అది పునాదికి ఏమాత్రం అనువైనది కాదని తేలిందన్నారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన లార్సెన్ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ)కంపెనీ, ఐఐటీ ఢిల్లీ, గౌహతి, చెన్నై, రూర్కీ, బాంబే, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) నిపుణులు సంయుక్తంగా నేషనల్ జియోఫిజికల్ సర్వే పరిశోధనా సంస్థల (ఎన్‌జీఆర్‌ఐ)టాప్ డైరెక్టర్లు సహాయం కోరారు. 

2020లో ఈ అంశంపై నిపుణుల మధ్య చర్చ జరిగింది.  అయోధ్యలోని ఆరు ఎకరాల ఆలయ భూమిలో 14 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు. దీని తరువాత పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి, ఖాళీ స్థలంలో ‘రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనే ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని 56 పొరలతో నింపారు. ఈ కాంక్రీటు ఆ తరువాత రాయిగా మారుతుంది. ఇనుమును ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీటును పునాది కోసం వినియోగించారు. ఈ విధంగా ఆలయ పునాది ఇనుము, సిమెంట్ లేకుండా నిర్మితమయ్యింది. 

మిగిలిన ఆలయం నిర్మాణమంతా రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నుండి తీసుకువచ్చిన గులాబీ ఇసుకరాయితో కొనసాగింది. అయితే 21 అడుగుల ఎత్తయిన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి కర్ణాటక,  తెలంగాణ నుండి తెచ్చిన గ్రానైట్ ఉపయోగించారు. నిర్మాణంలో ఉన్న రామ మందిరంలో ఒక్క గ్రాము ఇనుము కూడా ఉపయోగించలేదు. దీనికి కారణం రామ మందిరాన్ని నాగర్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించడమే. ఈ శైలిలో ఇనుమును వినియోగించనవసరం లేదు. 

ఉత్తర భారత హిందూ వాస్తుశిల్పంలోని మూడు శైలులలో నాగర్‌ శైలి ఒకటి. ఖజురహో, సోమనాథ్, కోణార్క్ సూర్య దేవాలయాలు నాగర్ శైలిలోనే నిర్మితమయ్యాయి.  రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రామమందిర ట్రస్టుతోపాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లోని ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.