హైదరాబాద్ ను చూస్తే లవ్ లో పడాల్సిందే : శేఖర్ కమ్ముల

హైదరాబాద్ ను చూస్తే లవ్ లో పడాల్సిందే : శేఖర్ కమ్ముల

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల సందడి చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు. శేఖర్ కమ్ముల రాకతో ఉస్మానియాలోని ఠాగూర్ ఆడిటోరియం విద్యార్థుల కేరింతలో మారుమోగిపోయింది. శేఖర్ కమ్ముల చిత్రాలతో తయారుచేసిన ఏవీకి ఈ ఈవెంట్ కు వచ్చిన ఇతర అతిథులతోపాటు విద్యార్థులు ఫిదా అయిపోయారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి శేఖర్ కమ్ముల ప్రసంగించారు.

" ఫిల్మ్ ఫెస్టివల్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే బిర్యానీ, ఇరానీ చాయ్ కే కాదు... గొప్ప ప్రేమకు నిలయం. ఈ విషయం నా సినిమా ద్వారా చెప్పాను. కానీ... ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులున్నారు కాబట్టి.. మరోసారి చెబుతున్నా. హైదరాబాద్ ను చూస్తే ఎవరైనా ప్రేమలో పడాల్సిందే. కుల్ కుత్బుషా-, భాగమతిల ప్రేమ చాలా అందంగా ఉండేది. మూసీ నది ఒడ్డున వారి ప్రేమ గొప్పగా సాగింది. వారి ప్రేమకు నిదర్శనంగా అప్పట్లో పురానాపుల్  ప్యారనాఫూల్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు మనం దాన్ని పురానాపూల్ బ్రిడ్జి అంటున్నాం’’ అని కామెంట్స్ చేశారు శేఖర్ కమ్ముల. 
 
‘‘హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ప్రేమ కనిపిస్తుంది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా దేశంలో ఎక్కడా లేని చరిత్ర ఉంది. పీవీ నర్సింహారావు, నాగేశ్ శర్మ, శ్యామ్ బెనగల్, అజారుద్దీన్ ఇలా అనేక రంగాల్లో గొప్పవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లినవాళ్లు. హైదరాబాద్ అంటే అంత ప్రేమ మనకు. సినిమాలతో కూడా ఇక్కడ ప్రేమలో పడొచ్చు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు వచ్చాయి’’ అని శేఖర్ కమ్ముల అన్నారు. 

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ సహా ఇతర విభాగాలలో విజేతలుగా నిలిచిన 13 మందికి శేఖర్ కమ్ముల ట్రోఫితోపాటు సర్టిఫికెట్లను అందజేసి వారితో ఫొటో దిగి ఉత్సాహాపరిచారు.