ఆ క్షణం అభిమానుల గురించే ఆలోచించాం : బోయపాటి శ్రీను

ఆ క్షణం అభిమానుల  గురించే ఆలోచించాం : బోయపాటి శ్రీను

‘అఖండ 2 : తాండవం’   విజయం చాలా ఆనందాన్ని,  గొప్ప గౌరవాన్ని  ఇచ్చిందని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.  బాలకృష్ణ  హీరోగా ఆయన రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై పాజిటివ్ టాక్‌‌తో సక్సెస్‌‌ఫుల్‌‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ఈ అఖండ విజయాన్ని ఎంత ఫీలైనా తక్కువే.  ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదు.  ప్రజలకు చేరాలని తీశాం.  

మన తత్వాన్ని బోధించే  గొప్ప  అంశాలతో  తీసిన సినిమా ఇది.  కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదాపడింది.  అయితే మా ఆలోచన అంతా బాలకృష్ణ  గారి అభిమానుల గురించే.  రెండు రోజులు ముందు చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ  రెండు గంటల ముందు టికెట్లు తీసుకుని థియేటర్స్ దగ్గరకు వెళ్లిన తర్వాత  వాయిదా అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ క్షణం మా ఆలోచనలన్నీ అభిమానుల గురించే. ఆ టైమ్‌‌లో బాలకృష్ణ గారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం.   ఆ తర్వాత అన్నీ  కూడా సజావుగా జరిగిపోయాయి. సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది.  సహజంగా  థియేటర్స్ విజిట్‌‌కి వెళ్ళినప్పుడు  అందరూ నిలబడి విజిల్స్, క్లాప్స్ కొడతారు.  కానీ ఈ సినిమాకి వెళ్ళినప్పుడు అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు.  నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి. ఈ చిత్రానికి  తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని మారుమూల గ్రామాల్లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. రెవెన్యూ పరంగా చాలా స్ట్రాంగ్‌‌గా ఉన్నాం’ అని చెప్పారు.