- యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో అత్యధికంగా 91.91%
- నల్గొండ జిల్లా నందికొండలో అతి తక్కువగా 59.68%
- ఉదయం నుంచే ఓటర్ల బారులు..
- చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం
- స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం..రేపు కౌంటింగ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్‌ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కలిపి 73 శాతం పోలింగ్నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మున్సిపాలిటీల్లో అత్యధికంగా 75.88% ఓట్లు పోలవ్వగా.. కార్పొరేషన్లలో 66.05 శాతం ఓటింగ్జరిగింది. మొత్తం 2,569 వార్డులు, 412 డివిజన్లలో 52.17 లక్షల మంది ఓటర్లు ఉండగా, వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి , మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, డీజీపీ శివధర్‌రెడ్డి హైదరాబాద్‌లోని తమ కార్యాలయాల నుంచే వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ.. అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చారు.
కాగా, ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, తాగునీటి వసతి కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. అలాగే, అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలను తోరణాలు, పూలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. యూత్ కోసం కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల అనంతరం సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
వాగ్వాదాలు.. తోపులాటలు
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం పలు పట్టణాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు కొన్నిచోట్ల బాహాబాహీకి దిగారు. వాగ్వాదాలతో మొదలై తోపులాటలు, ముష్టిఘాతాలవరకు వెళ్లడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలింగ్‌కేంద్రాల వద్ద డబ్బులు పంచుతున్నారని, ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని మరికొన్నిచోట్ల ఆందోళనకు దిగారు. కాగా, చిన్నచిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు ప్రకటించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని 15వ వార్డులో ఓటర్ల కు డబ్బులు, మద్యం పంచుతున్నారంటూ బీఆర్ఎ స్, బీజేపీ నాయకులు గొడవ పడ్డారు. పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు ఇరువ ర్గాలను చెదరగొట్టారు. 4, 5వ వార్డుల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరగ్గా, ఒకరిమీద మరొకరు దాడులు చేసుకున్నారు. బీజేపీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీయాదవ్, కాంగ్రెస్‌కు చెందిన సహకార సంఘం చైర్మన్ రాజు యాదవ్ మధ్య మాట మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తిలో ఓటర్లకు బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కొందరు గొడవకు దిగారు. మెదక్‌లోని మున్సిపల్ ఆఫీసు పోలింగ్ సెంటర్‌లో ఓటేసేందుకు వచ్చిన ఓ యువకుడి ఐడీ కార్డు ట్యాలీ కాకపోవడంతో పోలింగ్ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఆ యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మెదక్ లోని30వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కిరణ్, కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ మరో పావు గం టలో ముగుస్తుందనగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద మూడు సార్లు ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పలువురు ఒకరినొకరు కొట్టుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఓ పోలీస్ అధికారి బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణవేణి రోడ్డుపై బైఠాయించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్లు చేయడంతో కొందరు పోలీసులు ఆ పార్టీ వారిని పోలింగ్సెంటర్ల దగ్గరికి అనుమతిస్తూ.. తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
4వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మారం కుమార్ పోల్ స్లిప్‌ల వెనుక కారు గుర్తుకు ఓటు వేయాలని ముద్రించారని .. పోలింగ్ అధికారులు సైతం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి భార్య పోలింగ్ ఏజెంట్ఐడీతో వచ్చి కూర్చోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు అభ్యంతరం తెలపగా ఆమెను బయటకు పంపించారు.
కరీంనగర్ కిసాన్ నగర్‌లో డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో పోలీసులు ఓ బీఆర్ఎస్ కార్యకర్తను తనిఖీ చేయగా.. రూ.50 వేలు దొరికాయి. అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తిరుపతి పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అతన్ని కూడా చెక్ చేయగా మరో రూ.50 వేల నగదు లభ్యమైంది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ జీపులో ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతి పోలీస్ జీపునకు అడ్డంగా కూర్చుని ఆందోళనకు దిగారు. ఈ లోపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వచ్చి జీపు డోర్ తీసి బీఆర్ఎస్ కార్యకర్తను వెంట తీసుకెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పోలింగ్ కేంద్రాల్లోకి గన్మెన్లు, పీఏలతో వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కామారెడ్డిలోని 9,44వ వార్డులోని కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. 22 వ వార్డు బీడీ కార్మిక కాలనీ వద్ద బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వావాదం జరిగింది. బాన్సువాడలో 9 వ వార్డులో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఘర్షణ జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కడక్కడా స్పల్ప ఘటనలు చోటుచేసుకున్నాయి. భూపాలపల్లిలోని 22 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవి అనుచరులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి రాగా బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులను రోడ్డుపై పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు పట్టుకుని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మూడో వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్‌పై డీసీ తండా వాసులు తండాను మున్సిపాలిటీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ తిరగబడ్డారు. నర్సంపేటలోని 24వ వార్డులో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ కార్యకర్త ఫిరోజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నల్గొండజిల్లా హాలియాలోని 7 వ వార్డులో ఎన్నారైలకు సంబంధించి మూడు దొంగ ఓట్లు పడ్డాయని బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట 45 వ వార్డులో బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థి వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా పోలీసులు వారిని చెదరగొట్టారు. 46 వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు దొంగ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ నాయకులు పట్టుకొని చితకబాదారు. గాంధీనగర్ లో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్పీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడికి దిగారు.
దీంతో పోలీసులు లాఠీ చార్జి చేసి ఇరు పార్టీల నాయకులను అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ 6వ వార్డులో బీఆర్ఎస్ కొంతమంది ఆంధ్ర ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. 20వ వార్డులో కాంగ్రెస్ నేతలు దొంగ ఓటు వేయిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
29వ వార్డులో పోలింగ్ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన ఏజెంట్లపై కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిని పరామర్శించడానికి వచ్చిన నల్లమోతు సిద్ధార్థ పైనా కాంగ్రెస్ కార్య కర్తలు దాడికి దిగడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
32వ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగగా పోలీసులు లాఠీచార్జీ చేశారు. మిర్యాలగూడలో ఎన్నికల సిబ్బందికి రెమ్యూనరేషన్‌ను తగ్గించారని ఆరోపిస్తూ డీఆర్‌సీ సెంటర్ వద్ద అధికారులు ఆందోళన చేపట్టారు. రూ.1300 ఇవ్వాల్సి ఉండగా రూ.వెయ్యి మాత్రమే ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 39 వ వార్డులో 90 ఏండ్ల వృద్ధుడు అంబులెన్స్‌లో వచ్చి ఓటేశాడు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ18వ వార్డులో అబ్దుల్ బషీర్, ముస్తఫా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ముస్తఫా పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న హుస్సేన్ అనే వ్యక్తి మధ్యాహ్నం భోజనం తర్వాత పోలింగ్ సెంటర్‌లోకి వెళ్తుండగా బషీర్ అతనిపై దాడి చేశాడు. మర్మాంగంపై దెబ్బ తగలడంతో స్పృహ కొల్పోయిన హుస్సేన్‌ను పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి టూవీలర్‌పై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఇలా..
అంశం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు
ఎన్నికలు జరిగినవి 116 07
వార్డులు–డివిజన్లు 2,582 414
పోలైన ఓట్లు 28,04,267 10,05,132
ఓటేసిన పురుషులు 13,61,028 4,90,544
మహిళలు 14,42,751 5,14,475
ఇతరులు 238 113
పోలింగ్ శాతం 75.88 66.05%
చౌటుప్పల్‌లో పోటెత్తిన ఓటర్లు
మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 38,09,406 మంది ఓటేశారు. వీరిలో 18,51,829 మంది పురుషు లు, 19,57,226 మంది మహిళలు, 351 మంది ఇతరులు ఉన్నారు. 116 మున్సిపాలిటీల్లో 28.04 లక్షల మంది ఓటేయగా, 7 కార్పొరేషన్ల లో 10.05 లక్షల మంది ఓటేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో అత్యధికంగా 91.91% పోలింగ్ నమోదైంది.
ఇక్కడ 20 వార్డులుండగా మొత్తం 23,713 మం ది ఓటేశారు. నల్గొండ జిల్లా నందికొండలో అతి తక్కువగా 59.68% పోలింగ్ నమోదైంది. ఇక్క డ 12 వార్డులుండగా 8 ,069 మంది మాత్రమే ఓటేశారు. కార్పొరేషన్లలో పరిశీలిస్తే నల్గొండ లో అత్యధికంగా 77.36 % పోలింగ్ జరిగింది. ఇక్కడ 48 డివిజన్లకుగానూ 1,10,194 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అత్యల్పం గా నిజామాబాద్ కార్పొరేషన్‌లో కేవలం 59.12 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 60 డివిజన్లు ఉండగా 2,5,753 మంది ఓటు హక్కు వినియో గించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల సంఘం ప్రతి 2 గంటలకోసారి ప్రకటించింది. ఉదయం 9 గంటల వరకు 11.16% , 11 గంటల వరకు 28.48% , మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.54%, మధ్యాహ్నం 3 గంటల వరకు 62.09%, సాయంత్రం 5 గంటల వరకు 73.01% పోలింగ్ నమోదైనట్టు తెలిపారు.
