బ్యాటింగ్ పై ఆందోళన వద్దు : జడేజా

బ్యాటింగ్ పై ఆందోళన వద్దు : జడేజా

లండన్‌ : తొలి వామప్‌ మ్యాచ్‌ లో విఫలమైనా..టీమిండియా బ్యాటింగ్‌ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అసవరం లేదని ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. రాబోయే మ్యాచ్‌ ల్లో ఈ తరహా పిచ్‌ లు ఎదురుకావని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఇంగ్లిష్‌ వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఆరంభంలో పిచ్‌ చాలా సాఫ్ట్‌ గా ఉంది. నేను బ్యాటింగ్‌ కు వచ్చే సమయానికి మారిపోయింది. ఒకవేళ నేను ముందుగా వచ్చినా స్వింగ్‌ కు ఔటయ్యేవాడ్ని.వరల్డ్‌ కప్‌ లో ఇంత పచ్చిక ఉండే పిచ్‌ లు ఎదురుకావనే అనుకుంటున్నాం . ఇది మాకు తొలి మ్యాచే. ఈ ఒక్క ఇన్నింగ్స్‌‌తో ఆటగాళ్లను తక్కువగా అంచనా వేయొద్దు. ఫ్లాట్‌ వికెట్లపై ఆడాలంటే కొంత కుదురుకోవాలి. దీనిపై  క్రికెటర్లు కసరత్తులు చేస్తున్నారు. నాణ్యమైన క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాం . బ్యాటింగ్‌ యూనిట్‌ గా మా నైపుణ్యాన్ని మెరుగు పర్చుకునేందుకు కష్టపడుతున్నాం . జట్టులో అనుభవజ్ఞులకు కొదువలేదు. కాబట్టి బ్యాటింగ్‌ పై ఆందోళన అవసరంలేదు’ అని జడేజా పేర్కొన్నాడు.

అవసరమైతే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు తాను సిద్ధంగాఉన్నానని చెప్పాడు. తన షాట్‌ సెలెక్షన్‌ లో ఎలాంటి పొరపాట్లు లేవన్నాడు. ‘ఆరంభంలో  పిచ్‌ స్వింగ్‌ కు అనుకూలిస్తుందని భావించాం. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయాలనే ఆలోచనతోనే ముందుగా దిగాం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటే రాబోయే మ్యాచ్‌ ల్లో సులువుగా ఉంటుందని అలా చేశాం. సవాళ్లను స్వీకరించకుంటే  టోర్నీలో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటికైతే మేం బాగానే ఆడామనే అనుకుంటున్నాం . వరల్డ్‌ కప్‌ లో ఆడుతున్నాననేఒత్తిడి నాపై లేదు. రాబోయే మ్యాచ్‌ ల్ లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం ’ అని జడ్డూ వ్యాఖ్యానించాడు.