అమ్మాయిలు పదహారేళ్లకే పెండ్లి చేసుకున్నా తప్పులేదు

అమ్మాయిలు పదహారేళ్లకే పెండ్లి చేసుకున్నా తప్పులేదు

దేశంలో ఆడ పిల్లల పెండ్లి వయసును 21ఏండ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమాజ్‌వాదీ ఎంపీ ఎస్టీ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చట్టప్రకారం 18 ఏండ్లుగా ఉన్న ఆడ పిల్లల పెండ్లి వయసును 21కి పెంచుతూ చట్టంలో మార్పులు చేయాలని  కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు. పిల్లలను కలనగలిగే శక్తి వచ్చిన తర్వాత ఆడ పిల్లలు పెండ్లి చేసుకోవాలని హసన్ చెప్పారు. యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి పదహారేళ్లకే పెండ్లి చేసుకున్నా ఏం తప్పు లేదని అన్నారు. 18 ఏండ్ల వయసులో ఒక యువతి ఓటు వేయొచ్చన్నప్పుడు.. ఆమె పెండ్లి ఎందుకు చేసుకోకూడదని ఆయన ప్రశ్నించారు.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో ఎంపీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. భారత్ పేద దేశమని, తమ కుమార్తెలకు వీలైనంత తర్వగా పెండ్లి చేయాలని ఎక్కువ మంది భావిస్తారని ఎంపీ షఫికర్ రహ్మాన్‌ బార్క్‌ అన్నారు. పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తాను మద్దతు ఇవ్వబోనని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, సమాజ్‌వాదీ పార్టీకి సంబంధం లేదని అన్నారు. 

సమాజ్‌వాదీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను మీడియా ప్రశ్నించగా.. వారి కామెంట్స్‌తో పార్టీకి సంబంధం లేదని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రగతిశీల భావాలన్న పార్టీ అని, మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం గతంలో తమ ప్రభుత్వం అనేక పథకాలను పెట్టిందని తెలిపారు.