మంత్రి కేటీఆర్​కు నోటీస్ ఇచ్చినం : రొనాల్డ్ రోస్

మంత్రి కేటీఆర్​కు నోటీస్ ఇచ్చినం : రొనాల్డ్ రోస్
  • ప్రభుత్వ ఆఫీసుల్లో పార్టీ కార్యక్రమాలు వద్దు: రొనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: అధికార నివాసం ప్రగతి భవన్​ను పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్​పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. దీనిపై ఆయనకు నోటీస్ ఇచ్చినట్లు మంగళవారం హైదరాబాద్​లో మీడియాకు తెలిపారు. ఇదే అంశంపై కేంద్ర ఎలక్షన్ కమిషన్​కు రిపోర్టు పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులతో ఎన్నికల నిర్వహిస్తామని, డ్యూటీ పడినవారు హాజరుకాకపోతే నోటీసులు ఇస్తామని చెప్పారు.

10న ఫైనల్ ఓటర్ లిస్ట్..

కొత్త ఓటర్ నమోదుకు చివరి తేది ముగిసిందని, ఈనెల 10వ తేదిన ఫైనల్ లీస్ట్ పబ్లిష్ చేస్తామని రొనాల్డ్ రోజ్ తెలిపారు. కొత్తగా మరో 4లక్షల ఓటర్లు యాడ్ కావొచ్చన్నారు. ఈ నెల 3 నుంచి నామినేషన్లు ఉంటాయని, 15వ తేదీన విత్​డ్రాయల్స్ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు తెలిపి, ఓటర్ స్లిప్​లను పంపిణీ చేస్తామన్నారు. ఈవీఎంల మొదటి దశ పరిశీలన పూర్తయిందని, స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామని చెప్పారు. నవంబర్ 15 తర్వాత రెండో దశ పరిశీలన ఉంటుందన్నారు. సీజ్ చేసిన నగదు, బంగారాన్ని నిర్ధారించేందుకు కమిటీ వేశామని, విచారణ జరిపి రూ.4.50 కోట్లు తిరిగి ఇచ్చేశామని చెప్పారు. రూ.10 లక్షలకు పైగా నగదు దొరికిన కేసులను ఐటీ శాఖకు అప్పగించామన్నారు. ఇప్పటిదాకా రూ.43 కోట్లు పట్టుకున్నామని, 27 వేల లిక్కర్ బాటిళ్లు, 1024 కిలోల డ్రగ్స్ సీజ్ చేశామన్నారు.