
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో చెత్త సేకరణ, కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిష్ (సీఅండ్డీ) వ్యర్థాల తరలింపులో ఆలస్యం, నిర్లక్ష్యం వహించిన రాంకీ సంస్థకు శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నోటీసు జారీ చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న 2,532 గార్బేజ్ వల్నరెబుల్ పాయింట్ (జీవీపీ)లు, అలాగే బిన్ పాయింట్లలో డైలీ ఉదయం 10.30 గంటలలోపు చెత్తను ఒప్పందం మేరకు సంస్థ తప్పనిసరిగా తొలగించాలని హెచ్చరించారు.
అక్టోబర్ 16న జీవీపీల్లో కేవలం 1,879 ప్రాంతాల్లో మాత్రమే టైమ్ కి తొలగించారని, మిగతా ప్రాంతాల్లో తొలగించలేదన్నారు. నిర్దేశిత సమయంలో చెత్తను తరలించడంలో రాంకీ సంస్థ వైఫల్యం చెందుతుందన్నారు. అలాగే నగరంలో ప్రతిపాదించిన 2,000 సెకండ్ స్టోరేజ్ బిన్లలో 850 బిన్ లను మాత్రమే ఏర్పాటు చేసిందని, మిగిలిన బిన్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే నగరంలోని సర్కిల్ అధికారులు, ఏఎంఓహెచ్, డీఈఈ లు ఎన్నిసార్లు చెప్పినా సీఅండ్డీ వ్యర్థాలను తొలగించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉదయం 9.30 గంటలలోపు వ్యర్థాలను తొలగించాలని దేశించారు. ఈ ఆదేశాలను పాటించకపోతే, ఒప్పందంలోని నిబంధనల ప్రకారం పెనాల్టీ లు విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.