
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవసరాలకు నిధుల సమీకరణ కోసం.. నిరుపయోగంగా ఉన్న సర్కార్ భూములను వేలం ద్వారా అమ్మేందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అమ్మకానికి సంబంధించి ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేయడం, గైడ్ లైన్స్ జారీ చేయడం పూర్తి కాగా.. భూముల విక్రయంపై శనివారం ప్రకటన విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన షాపింగ్ కాంప్లెక్స్ లు, హోటళ్లు, హాస్పిటళ్లకు అతి దగ్గర్లో ప్లాట్లు ఉన్నట్లు అందులో వెల్లడించింది. వ్యక్తులు లేదా సమూహాలు, సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఈ వేలంలో పాల్గొనవచ్చని ప్రకటించింది. భూముల అమ్మకానికి సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుండగా, 25న ప్రీబిడ్ సమావేశం ఉంటుందని తెలిపింది. రిజిస్ట్రేషన్లకు జులై 13 చివరి తేదీ అని, 15వ తేదీన ఈ-వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదటి దశలో కోకాపేట భూములతోపాటు ఖానామెట్ భూములను ప్రభుత్వం వేలం వేయనుంది. కోకాపేటలో ఇప్పటికే హెచ్‌ఎండీఏ 49.92 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్‌లోని 7 ప్లాట్లతోపాటు గోల్డెన్ మైల్ లేఅవుట్‌లోని ఒక ప్లాట్ ను అమ్మకానికి పెట్టారు. ఖానామెట్‌లో టీఎస్‌ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని 5 ప్లాట్లను విక్రయించనున్నారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్‌ఎండీఏ, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను టీఎస్‌ఐఐసీ నిర్వహించనుంది.