ఇదేం రిక్రూట్​మెంట్..? ఒక్కరోజు గడువుతో నోటిఫికేషన్

ఇదేం రిక్రూట్​మెంట్..? ఒక్కరోజు గడువుతో నోటిఫికేషన్
  • ఇదేం రిక్రూట్​మెంట్..?
  • మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో హడావిడిగా లెక్చరర్​ పోస్టుల భర్తీ 
  • దరఖాస్తు చేసుకునేందుకు ఒక్కరోజే గడువు 

వనపర్తి టౌన్, వెలుగు: మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో  ఔట్​ సోర్సింగ్​ బేసిస్​పై లెక్చరర్ల నియామకం కోసం టెమ్రీస్ అధికారులు హడావిడిగా షెడ్యూల్ విడుదల చేయడంపై  నిరుద్యోగులు మండిపడుతున్నారు.  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 111 అప్ గ్రేడేడ్ జూనియర్ కాలేజీల్లో 840 జేఎల్ పోస్టులను భర్తీ చేసేందుకు జులై 29న టెమ్రీస్ సెక్రటరీ  అన్ని జిల్లాల మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఆర్ఎల్సీ లకు షెడ్యూల్ ను పంపించారు.  జిల్లాల్లో జేఎల్ పోస్టుల భర్తీ చేసేందుకు స్థానిక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వనించి ఈనెల 2  లోగా మైనార్టీ వెల్పేర్​ అధికారులు దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. దీంతో ఒక్కరోజులోనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లు  హడావిడిగా దరఖాస్తులు తీసుకున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఆదివారం  ప్రకటన ఇచ్చి సోమవారం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలని సూచించారు దీంతో చాలా మంది నిరుద్యోగులకు నోటిఫికేషన్ సంగతి కూడా తెలియదు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి.  ప్రిపరేషన్​కు కూడా సమయం లేకుండా ఈ నెల 16న రాత పరీక్ష నిర్వహిస్తామనడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

వరుస సెలవులతో ఇబ్బందులు..
మైనార్టీ జేఎల్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా మూడు ఏండ్ల ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లను జతచేయాలనడంతో అభ్యర్థులు సర్టిఫికెట్ల కోసం తాము పనిచేసిన కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు. ఈనెల 1న ఆదివారం, 2న బోనాల పండుగ సెలవులు కావడంతో విద్యాసంస్థలు మూసి ఉండడంతో అనేక మంది సర్టిఫికెట్లు తెచ్చుకోలేక అవస్థలు పడ్డారు. 

ఈ సారైనా నియామకాలు సక్రమంగా జరిగేనా...?
మైనార్టీ  జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ గత ఏడాది గందరగోళంగా మారింది. ఈ సారైనా పక్కాగా నియామకాలు జరుగుతాయా  అన్న అనుమానాలు  మొదలయ్యాయి. గతేడాది జేఎల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల చేయకుండానే ఇంటర్వ్యూలు నిర్వహించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఈసారి కూడా దరఖాస్తులకు టైమ్​ ఇవ్వకుండా హడావిడిగా నియామక ప్రయత్నాలు చేయడం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  జేఎల్ ఉద్యోగాల భర్తీ ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లకు అప్పగించడం, రాత పరీక్ష కు 100 మార్కులు , ఇంటర్వూలకు 50 మార్కులు పెట్టడంతో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు.

గడువు పెంచే అవకాశం ఉంది
మైనార్టీ జేఎల్ ఉద్యోగాల కోసం టెమ్రీస్ సెక్రటరీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ల నుంచి దరఖాస్తులను సోమవారం వరకు తీసుకొని 3,4 తేదిలలో స్క్రూటినీ చేస్తాం.  వరుస సెలవులు రావడంతో దరఖాస్తు గడువు పెంచాలని స్టేట్ అధికారులను కోరాం. మంగళవారం మీటింగ్ లో దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉంది.
- హవీలా రాణీ, ఆర్ఎల్సీ, నాగర్ కర్నూల్ జిల్లా