
యూఎస్ ఓపెన్ 2025లో టెన్నిస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. 24 గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్, ప్రస్తుతం టెన్నిస్ లో సంచలనంగా మారిన కార్లోస్ అల్కరాజ్ సెమీ ఫైనల్లో తలపడనున్నారు. వీరిద్దరూ తమ తమ క్వార్టర్ ఫైనల్లో అలవోక విజయాలు సాధించి కఠిన సవాలుకు సిద్ధమయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం (సెప్టెంబర్ 2) రాత్రి ప్రారంభమైన తొలి క్వార్టర్ ఫైనల్లో జిరి లెహెక్కాను అల్కరాజ్ వరుస సెట్లలో ఓడించాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 6-4, 6-2, 6-4 తేడాతో సునాయాసంగా గెలిచాడు.
22 ఏళ్ల స్పానిష్ సూపర్‌స్టార్ ఫోర్‌హ్యాండ్, రిటర్న్ షాట్ ల ముందు లెహెక్కా వద్ద సమాధానం లేకుండా పోయింది. వరల్డ్ నెంబర్ 2 ర్యాంక్ లో ఉన్న అల్కరాజ్ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఇప్పటివరకు మెన్స్ విభాగంలో ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా యూఎస్ ఓపెన్ గెలవలేదు. సెమీస్ లో జొకోవిచ్ తో మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. మొదటి సర్వ్‌లోనే 45 పాయింట్లలో 38 పాయింట్లు గెలుచుకున్నాడు. మొత్తం మ్యాచ్‌లో బ్రేక్ పాయింట్లను ఎదుర్కోకపోవడం విశేషం. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో అల్కారాజ్ రెండవ రౌండ్‌లో బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ చేతిలో ఓడిపోయాడు.
ఈ సారి మాత్రం కొత్త హెయిర్ స్టయిల్ తో అదిరిపోయే ఆటతో ప్రధాన ఆకర్షణగా మారాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 3) న జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి నోవాక్ జొకోవిచ్ 14వ సారి యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 38 ఏళ్ల సెర్బియన్ స్టార్ 6-3, 7-5, 3-6, 6-4 తేడాతో గెలిచి, ఫ్రిట్జ్‌పై ఒక్కసారి కూడా ఓడిపోని రికార్డును కొనసాగించాడు. సెమీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న కార్లోస్ అల్కరాజ్‌తో జొకోవిచ్ తలపడతాడు. అల్కరాజ్ తో గెలిస్తే ఫైనల్లో సిన్నర్ తో ఆడే అవకాశముంది.