- రూపే కార్డులకు ఎన్పీసీఐ ఫెసిలిటీ భద్రత కోసమే
ముంబై: కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (సీవీవీ) అవసరం లేకుండానే రూపే కార్డులతో చెల్లింపు సదుపాయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెచ్చింది. రూపే డెబిట్, రూపే క్రెడిట్ కార్డులు రెండింటికీ ఇది వర్తిస్తుందని ఎన్పీసీఐ వెల్లడించింది. మర్చంట్ యాప్ లేదా వెబ్పేజ్లలో కార్డులు టోకెనైజేషన్ చేసుకున్న వారికే ఈ కొత్త ఫెసిలిటీ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఉపయోగం ఏమిటి...
చెల్లింపు జరపాల్సిన ప్రతిసారీ పర్సులోంచి కార్డును బయటకు తీసి సీవీవీ చూడటం లేదా సీవీవీ, కార్డు డిటెయిల్స్‌ని గుర్తు పెట్టుకోవడం.. ఇక మీదట అవసరం ఉండదని ఎన్పీసీఐ పేర్కొంది. ఈ–కామర్స్ మర్చంట్ వద్ద తమ కార్డులను ఒకసారి టోకెనైజేషన్ చేసుకుంటే పై బాధలు తప్పుతాయని వివరించింది.
టోకెనైజేషన్...
సెక్యూర్డ్‌గా ట్రాన్సాక్షన్లు జరపడానికి టోకెనైజేషన్ అనేది చాలా సులభమైన పద్ధతి. ఎందుకంటే, మర్చంట్స్‌తో అసలైన కార్డు వివరాలను షేర్ చేయాల్సిన అవసరమే ఇక్కడ ఉండదు. ఒక కార్డు హోల్డరు తన కార్డును డొమెస్టిక్ ఈ–కామర్స్ సైట్లలో సేవ్ చేసుకోవాలనుకుంటే, ఒకే ఒక్కసారి కార్డు డిటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కింద ఒక ఓటీపీ కూడా ఇందుకోసం పంపుతారు. అప్పుడు ఆ డిటెయిల్స్ అన్నీ టోకనైజ్ అవడంతోపాటు...మర్చంట్ వద్ద సేవ్ అయి ఉంటాయి. ఆ మర్చంట్ వద్ద భవిష్యత్‌లో చేసే ఏ ట్రాన్సాక్షన్లకూ మళ్లీ కార్డు డిటెయిల్స్, సీవీవీ, ఎక్స్పైరీ వంటివి ఇవ్వక్కర్లేదు.
టోకెనైజేషన్ తప్పనిసరి చేసిన ఆర్బీఐ...
అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులకు టోకెనైజేషన్ తప్పనిసరనే రూల్‌ను ఆర్బీఐ తెచ్చింది. కార్డు హోల్డర్లు సైబర్ ఫ్రాడ్స్ బారిన పడకుండా చేసేందుకే ఈ కొత్త రూల్‌ను తెచ్చారు. ఈ టోకెనైజేషన్ వల్ల యూజర్లకు మెరుగైన డిజిటల్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ కలగడంతోపాటు, భద్రతా పెరుగుతుంది. ఆర్బీఐ ప్రకారం టోకెనైజేషన్ అంటే నిజమైన కార్డు డిటెయిల్స్‌ను అట్టేపెట్టకుండా, వాటి ప్లేస్‌లో ఆల్టర్నేట్ కోడ్‌ను అట్టేపెట్టడం.. దీనినే టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. మర్చంట్ల వద్ద అసలైన కార్డు వివరాలేవీ సేవ్ కాకపోవడం వల్ల ఈ పద్ధతి భద్రమైనదని ఆర్బీఐ చెబుతోంది. కార్డు హోల్డర్లకు సులభమైన రీతిలో చెల్లింపులు జరిపే వెసులుబాటు కల్పించాలనేదే తమ విజన్ అని రూపే పేర్కొంది. టోకెనైజ్డ్ కార్డులను సీమ్‌లెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.
