కరెంట్‍ మస్తు వాడిన్రు..ఎన్పీడీసీఎల్‍ సమ్మర్‍ ముందే 17 జిల్లాల్లో నయా రికార్డ్

కరెంట్‍ మస్తు వాడిన్రు..ఎన్పీడీసీఎల్‍ సమ్మర్‍ ముందే 17 జిల్లాల్లో నయా రికార్డ్
  • మొదటిసారిగా అత్యధికంగా 6,057 మెగావాట్లు నమోదు
  • గడిచిన వారం నుంచి పెరుగుతున్న వినియోగం
  • గతేడాది మార్చి 11న 5,816 మెగావాట్లే గతంలో టాప్‍ 
  • రాబోయే రోజుల్లో ఎంత వినియోగం పెరిగినా సిద్ధంగా ఎన్పీడీసీఎల్‍

వరంగల్‍, వెలుగు:  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో జనాలు కరెంట్‍ వినియోగించారు. 17 జిల్లాల్లో విద్యుత్‍ సేవలు అందించే టీజీఎన్పీడీసీఎల్‍ చరిత్రలో తొలిసారిగా శనివారం ఉదయం ఏకంగా 6,057 మెగావాట్లు వినియోగించినట్లు గణాంకాలు నమోదయ్యాయి. కాగా, గతేడాది సీజన్‍లో మార్చి 11న నమోదైన 5,816 మెగావాట్ల వినియోగమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది.
సమ్మర్‍ ముందే పెరిగిన కరెంట్‍ వాడకం..

ఎండాకాలంలో విద్యుత్​ వినియోగం పెరగడం సహజం. గతేడాది దాదాపు 50 డిగ్రీల ఉష్టోగ్రతల సమయంలోనూ గరిష్టంగా 5,816 మెగావాట్ల వినియోగమే ఉండగా, ఈసారి ఎండలు ముదరకముందే కరెంట్‍ వినియోగం పెరిగింది. శనివారం నమోదైన మెగావాట్లే ఇప్పటివరకు టాప్‍ అయినప్పటికీ గతేడాది రికార్డు కంటే గడిచిన 9 రోజుల్లో నాలుగుసార్లు 5,816 మెగావాట్ల రికార్డును దాటాయి. ఈ వారంలో తుఫాన్‍ కారణంగా ఎన్పీడీసీఎల్‍ పరిధిలోని ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు నమోదవడానికితోడు వాతావరణం మబ్బులు పట్టి ఉన్న సమయంలోనే 6,057 మెగావాట్ల వాడకం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.  

డిమాండ్‍కు తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లు.. 

మార్చి, ఏప్రిల్‍, మే నెలల్లో ఎండలు దంచికొట్టే ఉత్తర తెలంగాణ 17 జిల్లాల్లో కరెంట్‍ వినియోగం ఎంత పెరిగినా విద్యుత్తు సేవల్లో అంతరాయం లేకుండా చూసేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని ఎన్పీడీసీఎల్‍ సీఎండీ వరుణ్‍రెడ్డి తెలిపారు. 35 కొత్త 33/11 కేవీ సబ్‍ స్టేషన్లను చార్జీ చేశారు. 366 అదనపు పవర్‍ ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఇవేగాక 7,600 ట్రాన్స్​ఫార్మర్ల సామర్థ్యం పెంచారు. ఓవర్‍ లోడ్‍ ఉన్న 33 కేవీకి చెందిన 8 ఫీడర్లను విభజన చేశారు. 1200 కిలోమీటర్ల మేర 33 కేవీ ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లోఓల్టేజీ తగ్గించడానికి 392 కెపాసిటీ  బ్యాంకులు పెట్టారు. 

‘భద్రాద్రి’లో సమ్మర్​ ప్రణాళికలు.. 

భద్రాద్రికొత్తగూడెం: సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​లో భాగంగా భద్రాద్రికొత్తగూడెం నగరంతో పాటు పట్టణాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడమే లక్ష్యంగా విద్యుత్​ శాఖ జిల్లాలో రూ.146కోట్లతో పనులు చేపడుతోంది.  ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం జిల్లాలో రూ. 33.8 కోట్లతో టేకులపల్లి, కరకగూడెం, దమ్మపేట, పాల్వంచ, అశ్వారావుపేట, జూలూరుపాడు, దుమ్మగూడెం, భద్రాచలం మండలాల్లో 33/11కేవీ సబ్ స్టేషన్లు 13 ఏర్పాటు చేస్తున్నారు.

రూ.37.45 కోట్లతో గుండాల, ఇల్లెందు, బూర్గంపహడ్, లక్ష్మీదేవిపల్లి, దమ్మపేట, చుంచుపల్లి, ఆళ్లపల్లి, చర్ల, కరకగూడెం మండలాల్లో 33/11కేవీ సబ్​ స్టేషన్లను 13 ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రూ.24.5 కోట్లతో 33కేవీ ఇంటర్​ లింకింగ్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. సమ్మర్ యాక్షన్​ ప్లాన్​లో భాగంగా రూ.25.85కోట్లలో పవర్​ ట్రాన్స్​ఫార్మర్లు, రూ. 15.50కోట్లతో డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు.

రూ.5.6 కోట్లతో కెపాసిటర్ బ్యాంక్స్​ ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాద్రికొత్తగూడెం ఎన్పీడీసీఎల్​ ఎస్ఈ మహేందర్​తెలిపారు.  కాగా, జిల్లాలో 2,96,44 డొమెస్టిక్​ కనెక్షన్లున్నాయి. మార్చి నుంచి జనవరి వరకు 1,64,140 బిల్స్​కు సంబంధించి రూ. 124.42కోట్లు గృహ జ్యోతి కింద కరెంట్ సప్లై ఇచ్చారు. జిల్లాలో 51,826 అగ్రికల్చర్​ కనెక్షన్లున్నాయి. ఇవే కాకుండా గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కొత్తగా 9,106 కనెక్షన్లు ఇచ్చారు. 

గడిచిన 9 రోజులుగా వినియోగించిన మెగావాట్ల వివరాలు

తేదీ    నమోదైన సమయం    వాడిన మెగావాట్లు
20                   7:45                            5,845
21                   7:59                            5,904
22                   8:12                            5,837
23                   8:41                            5,709
24                   7:53                            4,798
25                   7:50                            5,158
26                   8.10                            5,279
27                  10.51                           5,948
28                  10.26                           6,057