పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ నాకివ్వండి.. కేసీఆర్ కు జలగం సుధీర్ విజ్ఞప్తి

పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ నాకివ్వండి.. కేసీఆర్ కు  జలగం సుధీర్ విజ్ఞప్తి

నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నగారా మోగింది. దీంతో అభ్యర్థుల వేటలో ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న  పేరును ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి పోటీకి  తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ చీఫ్ కేసీఆర్ తో పాటుగా కేటీఆర్ ను కోరారు ఎన్ఆర్ఐ జలగం సుధీర్.  మూడు జిల్లాల్లో తనకున్నా పరిచయాలతో పాటు పార్టీలో చేసిన సర్వీస్ గుర్తు చేస్తూ బయోడేటా పంపారు సుధీర్. 

గతంలోనూ కోదాడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశారు జలగం సుధీర్. జలగం ఫౌండేషన్ ద్వారా ఆయన వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. 2001 నుంచి బీఆర్ఎస్​ పార్టీలో ఉంటున్న సుధీర్..  గత అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో  తనకు ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వాలని కోరినప్పటికీ పార్టీ తిరస్కరించింది. 

ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది ఈసీ. షెడ్యూల్ ప్రకారం.. మే 2న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.  మే 10న నామినేషన్ల పరిశీలించనున్నారు. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక జూన్‌ 5న ఫలితాలను వెల్లడించనుంది ఈసీ.   ఈ సీటు నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.