కాకతీయ మెడికల్  కాలేజీకి..ఎన్నారైల విరాళం రూ.10 కోట్లు

కాకతీయ మెడికల్  కాలేజీకి..ఎన్నారైల విరాళం రూ.10 కోట్లు
  • కాలేజీలో మౌలిక వసతులు, పరికరాల కోసం ఖర్చు చేస్తామని వెల్లడి

వరంగల్​ సిటీ, వెలుగు: స్వదేశంపై ఉన్న మమకారం, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఎన్ఆర్ఐల బృందం భారీ విరాళం అందజేసింది. రూ.10 కోట్లను కాకతీయ మెడికల్​ అభివృద్ధి కోసం ప్రకటించింది. మంగళవారం హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్​లో జరిగిన సమావేశంలో వరంగల్  పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి ఎన్ఆర్ఐలను సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా పర్యటన సందర్భంగా ఎన్ఆర్ఐలను కలిసి పుట్టిన గడ్డ కోసం సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఈక్రమంలో డాక్టర్  సుజీత్  కుమార్  నేతృత్వంలో 200 మంది ఎన్ఆర్ఐలు కలిసి కాకతీయ  మెడికల్  కాలేజ్(కేఎంసీ)లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10 కోట్ల విరాళం అందజేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.

ఆధునిక వైద్య పరికరాలు, అదనపు వార్డులు, రోగుల కోసం అవసరమైన సౌలతులు, విద్యార్థులకు శిక్షణ వనరులు వంటి వాటికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. వేలాది మంది పేదలు చికిత్స పొందుతున్న కేఎంసీకి విరాళం అందించడం ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. విదేశాల్లో స్థిరపడిన వారంతా వీరిని ఆదర్శంగా తీసుకొని, తమ ప్రాంత అభివృద్ధికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. కేఎంసీ ప్రిన్సిపాల్  సంధ్యారాణి, ఫ్లోర్  లీడర్  తోట వెంకటేశ్వర్లు, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.