
రూ. వెయ్యి నుంచి రూ.4.5 లక్షల దాకా దిగ్గజాలూ ఉన్నాయ్
న్యూఢిల్లీ : లిస్టింగ్ నిబంధనలు పాటించడంలో విఫలమైన 250 కంపెనీలపై ఎన్‌ఎస్‌ఈ జరిమానా (ఫైన్) విధించింది. ఇందులో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని రెండు కంపెనీలు, జెట్ ఎయిర్వేస్ కూడా ఉన్నాయని తెలిపింది. మార్చి 2019తో ముగిసిన క్వార్టర్లో లిస్టింగ్ నిబంధనలు పాటించకపోవడంతో ఈ ఫైన్ విధించినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. ఈ 250 కంపెనీల మీదా కలిపి రూ. 9 కోట్ల ఫైన్ విధించారు. లిస్టింగ్ నిబంధనల పాటింపునకు సంబంధించిన ప్రమాణాలను సెబీ రూపొందించింది. అందుకనుగుణంగానే ఈ ఫైన్‌ను ఎన్‌ఎస్‌ఈ విధించింది. ఒక్కో కంపెనీపై ఫైన్ కనీసంగా రూ. 1,000 నుంచి అత్యధికంగా రూ. 4.5 లక్షల దాకా ఉంది. 31 కంపెనీలపై అత్యధికంగా రూ. 4.5 లక్షల ఫైన్ విధించారు.
ఈ జాబితాలో అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హిందుస్తాన్ కాపర్, భెల్, ఆయిల్ ఇండియా, ఐఓసీలు ఉన్నాయి. లిస్టింగ్ నిబంధనలు పాటించని కంపెనీల మీద చర్యలు తీసుకునేందుకు స్టాక్ ఎక్స్చేంజ్‌లకు సెబీ అధికారం కల్పించింది. అవసరమైతే ప్రమోటర్స్ వాటా ఫ్రీజ్ చేయడంతోపాటు, డీలిస్టింగ్ కూడా చేసే వీలు స్టాక్ ఎక్స్చేంజ్‌లకు ఉంది. నిబంధనలను పాటించని కంపెనీల షేర్లను కేటగిరీ మార్చడంతోపాటు, ట్రేడింగ్‌ను కూడా ఎక్స్చేంజ్‌లు సస్పెండ్ చేయొచ్చు. మహిళా డైరెక్టర్ నియామకం, ఆడిట్ కమిటీ ఏర్పాటులో వైఫల్యంతోపాటు, ఇతర నిబంధనలు పాటించనప్పుడు ఆయా కంపెనీల షేర్లలో ట్రేడింగ్‌ను నిలిపివేసే అధికారం ఎక్స్చేంజ్‌లకు ఉంటుంది.