ManasaVaranasi: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఫెమినా మిస్ ఇండియా, హీరోయిన్ మానస వారణాసి

ManasaVaranasi: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఫెమినా మిస్ ఇండియా, హీరోయిన్ మానస వారణాసి

యాక్టర్, తెలంగాణకు చెందిన మోడల్ మరియు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి అందరికీ సుపరిచితమే. ఇవాళ (2025 ఆగస్టు 12న) మానస వారణాసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మానస.

మానస వారణాసి:

మానస వారణాసి, తెలంగాణకు చెందిన మోడల్. అందాల పోటీ విజేత. ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల కిరీటాన్ని అందుకుంది. మానస వారణాసి 1997, మార్చి 27న హైదరాబాదులో జన్మించింది. తండ్రి ఉద్యోగం కారణంగా మలేషియాకు వెళ్ళిన మానస 2011-12 బ్యాచ్‌లో GIIS మలేషియా క్యాంపస్ నుండి గ్రేడ్ 10 పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాదుకి వచ్చి ఎఫ్ఐఐటి జెఈఈలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. 2019లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీలో పాల్గొన్న మానస.. టాప్ 3 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. 2020లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ కోసం ఆడిషన్ చేసి, అందులో విజేతగా నిలిచింది.

మానస వారణాసి సినిమాలు:

ఇకపోతే మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ మూవీలో మానస నటించింది. సత్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న‘కపుల్‌ ఫ్రెండ్లీ’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న, ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.