
Investment Ideas: గడచిన రెండు వారాలుగా భారీ ఒడిదొడుకులతో ఉక్కిరిబిక్కిరైన ఈక్విటీ ఇన్వెస్టర్లు ఈవారం కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్ ఎంచుకోవాలి.. ఇప్పుడు మంచి బెట్టింగ్ పిక్స్ కోసం చూస్తున్నట్లయితే అలాంటి వారికి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నువామా నుంచి మంచి కీలక అప్ డేట్ ఉంది. పెట్టుబడిదారులు 30 శాతం వరకు రాబడిని పొందగల కొన్ని షేర్లను ఎంపిక చేసిన బ్రోకరేజ్ వాటికి బై రేటింగ్ కూడా అందించింది.
* ముందుగా బ్రోకరేజ్ రాడార్లో ఉన్న స్టాక్ టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటాన్. ప్రస్తుతం మార్కె్ట్లో స్టాక్ ధర రూ.3వేల 416 కంటే 31 శాతం ఎక్కువగా రూ.4వేల 479కి చేరుకుంటుందని తన అంచనాలను పంచుకుంది నువామా. తొలి త్రైమాసికంలో 16 శాతానికి పైగా వృద్ధిని కంపెనీ చూడటంతో బులిష్ వ్యూ కలిగి ఉంది బ్రోకరేజ్ సంస్థ. కేవలం జ్యువెలరీ ఒక్కటే కాకుండా కంపెనీ విక్రయిస్తున్న వేరబుల్స్ సెగ్మెంట్ 24 శాతం పెరగటం భవిష్యత్తుపై సానుకూలతలను పెంచుతోంది. ఇదే క్రమంలో కంపెనీ తన పనితీరును మెరుగుపరుచుకుని నష్టాలను తగ్గించుకుంటోంది.
* నువామా ఎంచుకున్న రెండవ స్టాక్ గోద్రేజ్ కన్జూమర్. ప్రస్తుతం స్టాక్ 1220 రేటు వద్ద ఉండగా.. ఇది 19 శాతం పెరిగి రూ.1450కి భవిష్యత్తులో చేరుకుంటుందని బ్రోకరేజ్ నమ్ముతోంది. కంపెనీ భారత సబ్బుల వ్యాపారం ఆదాయాల ఒత్తిడితో పాటు ఇండోనేషియాలో పెరిగిన కాంపిటిషన్ ఎదుర్కొంటోంది కంపెనీ. అయినప్పటికీ ఏడాది ప్రాతిపధికన 10 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది.
* అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ ఎంపిక చేసుకుని బై రేటింగ్ ఇచ్చిన మూడవ స్టాక్ బీఎస్ఈ. ప్రస్తుతం కంపెనీ షేర్లు రూ.2వేల 442 వద్ద ట్రేడవుతుండగా.. గతంలోని టార్గెట్ ధరను మరింతగా పెంచిన బ్రోకరేజ్ దానిని రూ.2వేల 820కి అప్ గ్రేడ్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరగటం కంపెనీ ఆదాయాలను పెంచుతోందని బ్రోకరేజ్ భావిస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.