ఢిల్లీలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఢిల్లీలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
  • ‘ఆత్మగౌరవ్ దివస్’ పేరిట ఆదిలీలా ఫౌండేషన్ కార్యక్రమాలు 

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో మాజీ సీఎం, సినీ నటుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ‘సంవిధాన్ సదన్’ (పాత పార్లమెంట్ భవనం)లోని ఎన్టీఆర్ విగ్రహానికి అదనపు సొలిసిటర్ జనరల్, ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ నౌపడా సత్యనారాయణ, ఇతర నేతలు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని ఏపీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే జైన్, ఉన్నతాధికారులు అర్జా శ్రీకాంత్, రామారావు, వెంకటరమణ, కదిరి మోహన ప్రభాకర్, ఏపీ భవన్ సిబ్బంది ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ, చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ చేసిన కృషిని పలువురు స్మరించుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ/ ఏపీ భవన్‌‌‌‌‌‌‌‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఆత్మగౌరవ్ దివాస్’ పేరిట జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆది నారాయణ, చైర్మన్ చంద్రహాస్ ఇప్పలపల్లి నేతృత్వం లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ వేడుకల్లో తెలుగు ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.