జనవరి 1 నుంచి నుమాయిష్​ ఎగ్జిబిషన్​... టికెట్​ ధర ఎంతంటే....

జనవరి 1 నుంచి నుమాయిష్​ ఎగ్జిబిషన్​... టికెట్​ ధర ఎంతంటే....

హైదరాబాద్​ నాంపల్లి గ్రౌండ్స్​లో 83వ  ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)కి సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు  దాదాపు పూర్తి అయ్యాయి. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో  జనవరి 1న  నుమాయిష్ ప్రారంభం కానుంది. టిక్కెట్ ధర రూ.40 ఉండనుంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఎగ్జిబిషన్ సొసైటీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. 

 దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ దాదాపు 2,400 స్టాల్స్ కొలువుదీరనున్నాయి.  ఎగ్జిబిషన్‌లో ఒకే చోట అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. నగరంలో అందుబాటులో లేని అనేక రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. దుస్తులు, మంచాలు, వంట సామాగ్రి, మహిళల కోసం వంటసామగ్రి, దుప్పట్లు, బెడ్‌షీట్లు, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త ఫర్నిచర్, మల్టీ పర్పస్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి.

దాదాపు 22 లక్షల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని ఎగ్జిబిషన్​ నిర్వాహకులు  అంచనా వేస్తారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులను గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు.  ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్రీడా పోటీలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.అనేక వినోద విభాగాలు ఏర్పాటు చేశామని ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ఎనుగుల రాజేందర్ కుమార్ తెలిపారు. 

 ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతూ విద్యావ్యాప్తికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. 33 సబ్ కమిటీల ద్వారా ప్రదర్శనను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.