- ఆన్లైన్లో బిల్స్ సమయంలో నిబంధనలు పాటించాలి
- డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లోని మధ్యాహ్న భోజన పథకం(పీఎం పోషణ్)లో పనిచేసే వంట మనుషుల నియామకంపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇకపై ఇష్టారాజ్యంగా కాకుండా.. స్కూల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగానే కుక్ కమ్ హెల్పర్లను నియమించుకోవాలని తెలిపారు. ఈ మేరకు డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు.
స్కూల్లోని స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఎంతమంది హెల్పర్లు ఉండాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. స్కూళ్లలో 25 మంది వరకు విద్యార్థులు ఉంటే కేవలం ఒక్క కుక్ కమ్ హెల్పర్‌ను మాత్రమే నియమించుకోవాలి. విద్యార్థుల సంఖ్య 26 నుంచి 100 మధ్య ఉంటే ఇద్దరు హెల్పర్లకు అనుమతి ఇవ్వగా, 101 నుంచి 200 వరకు స్టూడెంట్లు ఉంటే ముగ్గురు హెల్పర్లను ఎంగేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి 100 మంది విద్యార్థులకు మరొక అదనపు హెల్పర్‌ను నియమించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిర్ణీత సంఖ్య కంటే ఒక్కరు ఎక్కువగా ఉన్నా.. మరొకరిని తీసుకోవచ్చు. కుక్ కమ్ హెల్పర్ల బిల్లుల చెల్లింపులోనూ పారదర్శకత పాటించేందుకు నవంబర్ నుంచి కుక్ కమ్ హెల్పర్ల బిల్లులను కేవలం ఆన్‌లైన్ ద్వారానే క్లెయిమ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. యూడైస్ డేటా ఆధారంగా వివరాలు ఇవ్వాలని, లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, కొన్ని జిల్లాల్లో తక్కువ మంది వంట మనుషులను తీసుకుంటున్నట్టు అధికారుల దృష్టికి రావడంతో ఈ ఉత్తర్వులు జారీచేశారు.
