
- మనదేశంలో మొత్తం 13,263 మంది
- వెల్లడించిన నైట్ ఫ్రాంక్ రిపోర్ట్
న్యూఢిల్లీ: మనదేశంలో అల్ట్రా-హై నెట్ వర్త్ వ్యక్తుల సంఖ్య వార్షికంగా 6 శాతం పెరిగి గత ఏడాది 13,263కి చేరుకుంది. సంపన్నుల సంఖ్య మరింత పెరిగి 2028 నాటికి దాదాపు 20 వేలకు చేరుకుంటుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా 'ది వెల్త్ రిపోర్ట్ 2024' వెల్లడించింది. 30 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.248 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వారిని అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడివల్స్(యూహెచ్ఎన్డబ్ల్యూఐలు)గా పిలుస్తారు.
మనదేశంలో యూహెచ్ఎన్డబ్ల్యూఐల సంఖ్య 2023లో 6.1 శాతం పెరిగి 13,263కి చేరుకోగా, అంతకుముందు సంవత్సరంలో 12,495 మంది ఉన్నారు. ఈ సంఖ్య 2028 నాటికి 19,908కి విస్తరించవచ్చని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ అన్నారు. 90 శాతం మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలు 2024 సంవత్సరంలో తమ సంపదను మరింత పెంచుకునే అవకాశం ఉంది. దాదాపు 63 శాతం మంది తమ సంపద విలువలో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో 28.1 శాతం పెరిగి 2028 నాటికి 8,02,891కి చేరుకుంటుందని బైజాల్చెప్పారు. గత సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యూహెచ్ఎన్డబ్ల్యూఐల సంఖ్య 2023లో 4.2 శాతం పెరిగి 6,01,300 నుంచి 6,26,619కి చేరుకుంది.