అంగన్‌‌వాడీ సెంటర్లలో న్యూట్రీ గార్డెన్లు..ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ 631 సెంటర్లలో ఏర్పాటు

అంగన్‌‌వాడీ సెంటర్లలో న్యూట్రీ గార్డెన్లు..ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్  631 సెంటర్లలో ఏర్పాటు
  • కామారెడ్డి జిల్లాలో సీడ్స్ కిట్ల పంపిణీ
  • చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇండ్ల వద్దకే పోషకాహారం

కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 631 అంగన్‌‌వాడీ సెంటర్లలో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేయనున్నారు. 6 ఏండ్ల లోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్‌‌వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రతిరోజూ పోషకాహారం అందజేస్తున్నా, బయట నుంచి తెచ్చే కూరగాయలు, ఆకుకూరలతో వంట చేయడం వల్ల ధరల హెచ్చుతగ్గులు, సరైన రకాల కూరగాయలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంటర్లలోనే న్యూట్రీ గార్డెన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా తాజా ఆకుకూరలు, కూరగాయలతో వంటలు చేయనున్నారు. 

సేంద్రియ పద్ధతిలో పంటలు..

న్యూట్రీ గార్డెన్లలో ఆకుకూరలు, కూరగాయలను సేంద్రియ ఎరువులతో పండించనున్నారు.  అధిక పోషక విలువలు గల పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలకూర, తోటకూర, మెంతికూర, గొంగూర, కరివేపాకు, వంకాయ, బెండకాయ, సోరకాయ, టమాట వంటి కూరగాయలు పండించనున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడటంతో ఆరోగ్య పరంగా  ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు సెంటర్లకు వచ్చే మహిళలకు, పిల్లలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో ఈ గార్డెన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

ఉమ్మడి జిల్లాలో 631 సెంటర్లు..

ఉమ్మడి జిల్లాలో 2,693 అంగన్‌‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 631 సెంటర్లలో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 1,193 సెంటర్లు ఉండగా, వాటిలో 331 సెంటర్లు, నిజామాబాద్ జిల్లాలో 1,500 సెంటర్లు ఉండగా 300 సెంటర్లలో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటవుతున్నాయి.  సొంత భవనాలు ఉండి, ఆకుకూరలు పెంచేందుకు స్థలం ఉన్న సెంటర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. కామారెడ్డిలో న్యూట్రీ గార్డెన్లపై సీడీపీవోలతో సమావేశం నిర్వహించి, విత్తనాల కిట్లను అందజేశారు.

అందనున్న పోషకాహారం..

 న్యూట్రీ గార్డెన్ల ఏర్పాటుతో అంగన్‌‌వాడీ సెంటర్లలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందనున్నది. తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కామారెడ్డిలో 331 సెంటర్లను ఎంపిక చేసి సీడ్ కిట్లను అందించాం. స్థలం ఉన్న సెంటర్లకే ప్రాధాన్యం ఇచ్చాం. – ప్రమీల, కామారెడ్డి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి