హైదరాబాద్ : టాటా ఏస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మీద ఆగి ఉన్న టాటా ఏస్ డ్రైవర్ వెనక్కి చూడకుండా డోర్ తీశాడు. దీంతో వెనకాల బైక్ పై వస్తున్న ఇద్దరు ఒక్కసారిగా డోర్ తగలడంతో కింద పడిపోయారు. వారిపై నుంచి టిప్పర్ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన హైదరాబాద్ IDA బొల్లారం దగ్గర జరిగింది.
ప్రమాదం జరిగింది ఇలా..
సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన కనక మహాలక్ష్మీ బొల్లారంలో ఓ కార్యాలయంలో లేబర్ గా పని చేస్తోంది. ఆమె శుక్రవారం మధ్యాహ్నం విధులకు వెళ్లేందుకు తన మరిది సైదులు రెడ్డి బైక్ పై బయల్దేరింది. వీరు వెళ్తుండగా..బొల్లారం మున్సిపల్ ఆఫీస్ దగ్గర రోడ్డుపై ఆగివున్న టాటా ఏస్ డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తీయడంతో… వదినా, మరిది రోడ్డుపై పడిపోగా.. అదే సమయంలో పక్కనే వెళుతున్న టిప్పర్ వారి పైనుంచి వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.
