ట్రిపుల్​ ఆర్​ అలైన్ మెంట్ సర్వేపై అభ్యంతరాలు

ట్రిపుల్​ ఆర్​ అలైన్ మెంట్ సర్వేపై అభ్యంతరాలు
  • ఉమ్మడి మెదక్​జిల్లాలో పెరుగుతున్న భూ బాధితుల ఆందోళనలు 

మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట/నర్సాపూర్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణకు  సంబంధించి కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అలైన్ మెంట్ సర్వే జరుగుతోంది. సంగారెడ్డి, అందోల్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో సర్వే చేస్తుండగా పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదివరకు కాళేశ్వరం కాల్వలకు, రైల్వే లైన్ నిర్మాణానికి, నేషనల్ హైవే రోడ్డుకు భూములు ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ ట్రిపుల్​ఆర్​కు భూములు ఇస్తే తాము బతికేదెలా?  అని రైతులు..  గ్రామాలు, తండాల మీదుగా రోడ్డు నిర్మిస్తే తమ ఇండ్లు పోతాయని ఆయా ప్రాంతాల ప్రజలు అభ్యంతరం చెబుతున్నారు. మరోవైపు పరిహారం ఎంత ఇస్తారో కూడా చెప్పకుండా భూ సేకరణ ప్రక్రియ చేపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. !

  • సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లిలో 1994లో అప్పటి ప్రభుత్వం 150 మంది రైతులకు అసైన్డ్ ​భూములు పంపిణీ చేసింది. అందులో నుంచి కాళేశ్వరం కాల్వల నిర్మాణం కోసం 19 ఎకరాలు తీసుకోగా, రోడ్డు విస్తరణ కోసం 25 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రీజినల్ రింగ్ రోడ్డుకు భూములు సేకరించాలని అధికారులు నిర్ణయించడంపై రైతులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటీవల ఆందోళన చేపట్టారు. 
  • సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దేవులపల్లి, కాసాల గ్రామాల్లో ట్రిపుల్ ఆర్ సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. కంప్లైంట్స్ ఉంటే చెప్పుకోవడానికి 21 రోజుల గడువు ఇచ్చి,  ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం ఎంతో చెప్పకుండా సర్వే చేయడం, హద్దులు పాతడంపై ఫైర్​ అవుతున్నారు. 
  • మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడ తండా పంచాయతీ పరిధిలో హచ్యతండా, జయరాం తండా ఉన్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు ను ఈ తండాల మీదుగా నిర్మించే మార్కింగ్ ఇచ్చారు. ఈ రోడ్డులో తాము ఇండ్లు కోల్పోతామని, ట్రిపుల్ ఆర్ వల్ల ఇండ్లు దెబ్బతినకుండా  అలైన్​మెంట్ మార్చాలని తండావాసులు డిమాండ్​ చేస్తూ నర్సాపూర్ ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. 
  • తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ వద్ద ఎకరా భూమి రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోంది. కాగా,  ఇక్కడ భూములకు ప్రభుత్వం పరిహారం ఎంత ఇస్తుందనేది తెలియక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మాసాయి పేట రైల్వేస్టేషన్ సమీపంలో భారీ జంక్షన్ కోసం వంద ఎకరాల కొద్దీ భూమి సేకరించనుండగా ఎవరిభూమి ఎంతపోతుందోనని స్థానిక రైతులు టెన్షన్​ పడుతున్నారు. 

ఎమ్మెల్యే అసహనం...

పరిహారం ఎంత ఇచ్చేది చెప్పకుండానే భూ సేకరణ చేపట్టడంపై ప్రధానంగా సంగారెడ్డి, అందోల్ డివిజన్ పరిధిలోని పెద్దాపూర్, గిర్మాపూర్, నాగపూర్, ఇరిగిపల్లి, కలబ్ గూర్, తాళ్లపల్లి, కోర్ఫోల్, కాసాల, హత్నూర గ్రామాల పరిధిలో రైతుల నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ను కలిసి బాధితుల పక్షాన వినతి పత్రం అందజేశారు. పరిహారం తేల్చకుండానే భూ యజమానులకు నోటీసులు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ బాధితుల పక్షాన పోరాటం చేస్తానని ప్రకటించారు.

మరోచోట భూమి ఇయ్యాలే.. 

మా భూమిలో కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల కోసం 3 ఎకరాల 20 గుంటలు పోయింది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో ఒక ఎకరం 30 గుంటలు తీసుకుంటామని పంచాయతీ ఆఫీస్ లో నోటీస్​ అంటించిన్రు. మాకు ఉన్న  భూమి మొత్తం పోతే మా పరిస్థితేంటి? మాకు భూమికి బదులుగా మరోచోట భూమినే ఇయ్యాలె. 

- గౌండ్ల అంజాగౌడ్, 
దేవులపల్లి, హత్నూర

మా గతి ఏంకావాలె 

మా బతుకు దెరువు అంతా ఎవుసం మీదనే.  కాళేశ్వరం కాల్వల కోసం 3 ఎకరాల 20 గుంటలు పోయింది. ఇప్పుడు రింగ్ రోడ్డుకు 2 ఎకరాల 20 గుంటలు పోతుంది. గిట్ల ఎకరాల కొద్దీ తీసుకుంటే మా గతి ఏంకావాలె. నష్టపరిహారం ఎంతో కూడా చెప్పకుండా సర్వే చేయడం కరెక్టు కాదు.  

-  విఠల్, రైతు, దేవులపల్లి