పాకిస్థాన్ లో కృష్ణుడి గుడి నిర్మాణానికి అడ్డంకులు

పాకిస్థాన్ లో కృష్ణుడి గుడి నిర్మాణానికి అడ్డంకులు

ఇస్లామాబాద్‌‌లో తొలి టెంపుల్ నిర్మాణానికి అడ్డంకులు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కృష్ణుడి ఆలయం పనులు ప్రారంభమైన వారం రోజులకే వ్యతిరేకత మొదలైంది. గుడి కట్టడానికి ఇమ్రాన్ ఖాన్ సర్కారు రూ.10 కోట్లు సాయంచేస్తామని  ఇంతకుముందే ప్రకటించింది.   ఈమధ్యనే  భూమిపూజ కూడా జరిగింది.  నిర్మాణ పనులు ఆపాలంటూ ఓ మతపరమైన సంస్థ ఫత్వా జారీ చేసింది. గుడి పనులు ఆపాలంటూ పాకిస్తాన్ కోర్టులోనూ పిటిషన్ వేశారు.

జామియా అషర్ఫియా ఫత్వా జారీ

2018 ఎన్నికల్లో  గెలిచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ మైనారిటీలో మతపరమైన స్వేచ్ఛ కల్పిస్తామని హమీ ఇచ్చారు. పాకిస్తాన్ లో మైనారిటీల్లో హిందువులే ఎక్కువ. ఎన్నికల్లో గెలిచిన ఏడాది తర్వాత ఇస్లామాబాద్ లో కృష్ణుడి ఆలయం నిర్మాణానికి భూమిని కూడా లోకల్ హిందు కమిటీకి బదిలీ చేశారు. గుడి నిర్మాణానికి  ఇస్లామాబాద్ క్యాపిటల్ డెవలప్ మెంట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. దీనికి  రూ.10 కోట్లను ఇమ్రాన్ ఖాన్  సర్కార్​ మంజూరు చేశారు. గత నెల 23న హ్యూమన్ రైట్స్ పార్లమెంటరీ సెక్రటరీ లాల్ చంద్ మల్హి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇస్లాంలో ఆలయాల నిర్మాణానికి అనుమతి లేదంటూ లాహోర్ కు చెందిన జామియా అషర్ఫియా ఫత్వా జారీ చేసింది. దీనికి కొందరు ముఫ్తీలు, మతపెద్దలు మద్దతు చెప్పారు.  టెంపుల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైస్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇస్లామాబాద్ లో గుడి కట్టాలంటూ  హిందువులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు.