
- ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఏర్పాట్లు పూర్తి
- నాలుగైదు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కలిపి ఒక ఆర్వో నియామకం
- ఈ నెల 23న పోలింగ్.. వచ్చే నెల 11న రిజల్ట్
- కలెక్టర్లు, అధికారులతో ఎస్ఈసీ రాణి కుముదిని సమావేశం
- నామినేషన్లు, శాంతిభద్రతలపై కీలక సూచనలు
హైదరాబాద్, వెలుగు:
స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ గురువారం (అక్టోబర్ 09) రిలీజ్ కానున్నది. 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీలవారీగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానున్నది. ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎలక్షన్ నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొదటి విడతలో 53 రెవెన్యూ డివిజన్లలో 2,963 ఎంపీటీసీలకు, 292 జడ్పీటీసీలకు నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మాత్రం నవంబర్ 11వ తేదీన వెల్లడించనున్నారు. ఈ మేరకు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలుకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎంపీటీసీలకు మండల పరిషత్ ఆఫీస్‌లో, జడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. నాలుగైదు ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు కలిపి ఒక ఆర్వోను నియమించారు. వీరు నామినేషన్ నుంచి రిజల్ట్ వచ్చే వరకు పర్యవేక్షించనున్నారు. నామినేషన్ పత్రాలతోపాటు స్క్రూటినీ చేపట్టనున్నారు.
కలెక్టర్లు, జిల్లా అధికారులతో సీఈసీ సమావేశం
హైకోర్టులో విచారణ అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. తొలుత తమ లీగల్ బృందంతో సమాలోచనలు జరిపారు. ఆ వెంటనే రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలుపై కీలక సూచనలు చేశారు. నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లతోపాటు శాంతి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు అధికారులకు సైతం సూచనలు చేశారు. కాగా, ఎన్నికల నిర్వహణకు తాము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని కలెక్టర్లు నివేదించారు.
మొదటి విడతలో 292 మండలాల్లో..
రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మెుత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మెుదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో ఉంటాయి. మొదటి విడతలో 292 మండలాల్లో ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ వెలువడనున్నది. రెండో విడతలో ఈ నెల13న 50 రెవెన్యూ డివిజన్లలో 2,786 ఎంపీటీసీ, 273 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఇలా..
మొదటి విడత రెండో విడత
ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9 అక్టోబర్ 13
నామినేషన్ ఆఖరు తేదీ అక్టోబర్ 11 అక్టోబర్ 15
ఉపసంహరణ చివరి తేదీ అక్టోబర్ 15 అక్టోబర్ 19
పోలింగ్ తేదీ అక్టోబర్ 23 అక్టోబర్ 27
ఫలితాలు నవంబర్ 11 నవంబర్ 11