- గత అక్టోబరుతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ
- రేట్లను తగ్గించడంతో నెమ్మదించిన జీఎస్‌టీ వసూళ్ల పెరుగుదల
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు పెరగడం ఈసారి నెమ్మదించింది. గత నెల స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరం అక్టోబర్లో రూ. 1.87 లక్షల కోట్లు వసూలు కాగా, ఈసారి కేవలం 4.6 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి తక్కువ వృద్ధి రేటు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం ఈ నెలకు సంబంధించిన వసూళ్లపై కనిపించింది.
సెప్టెంబర్ 22 (నవరాత్రుల మొదటి రోజు) నుంచి వంట సామాగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ దాకా 375 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సగటున 9 శాతం వృద్ధి ఉండగా, అక్టోబర్లో అది 4.6 శాతానికే పరిమితమైంది. ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్లు వసూలు కాగా, 6.5 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్లో రూ. 1.89 లక్షల కోట్లు వచ్చాయి.
స్థూల దేశీయ ఆదాయం 2 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన పన్ను సుమారు 13 శాతం పెరిగి రూ. 50,884 కోట్లుగా నమోదైంది. దిగుమతులకు సంబంధించిన ఐజీఎస్టీ దాదాపు 13 శాతం పెరిగింది. జీఎస్టీ రీఫండ్స్ 39.6 శాతం పెరిగి రూ. 26,934 కోట్లుగా ఉన్నాయి.
