యూట్యూబర్ : బెంగాలీ వంటల రాణి.. 83 ఏళ్ల వయసులో లక్షల్లో సంపాదిస్తోంది !

యూట్యూబర్ : బెంగాలీ వంటల రాణి.. 83 ఏళ్ల వయసులో లక్షల్లో సంపాదిస్తోంది !

ఆమెకు వంట చేయడమంటే ఇష్టం. 83 ఏండ్లు దాటినా తానే స్వయంగా పిల్లలకు వండి పెడుతుంటుంది పుష్పరాణి.  ఆమె చేతి వంట తిన్నవాళ్లు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఆ కుకింగ్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌ గురించి ఎలాగైనా ప్రపంచానికి తెలిసేలా చేయాలి అనుకున్నాడు ఆమె మనవడు సుదీప్‌. అందుకు సోషల్ మీడియాని వేదికగా ఎంచుకున్నాడు. అలా నేటి యువతకు తెలియని ఎన్నో రకాల గ్రామీణ వంటకాలను యూట్యూబ్‌‌‌‌ ద్వారా పరిచయం చేస్తోంది పుష్పరాణి.

పుష్పరాణి సర్కార్‌‌‌‌‌‌‌‌ది పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని ఇలాంబజార్‌‌‌‌కు దగ్గర్లోని బోన్‌‌‌‌విల్లా అనే  ఒక చిన్న గ్రామం. ఆమె వయసు దాదాపు 83 ఏండ్లు. ఈ వయసులో కూడా ఎంతో హుషారుగా పనులు చేస్తుంటుంది. వాళ్ల ప్రాంతంలో ‘వంట చేయడంలో ఆమె తర్వాతే ఇంకెవరైనా’ అని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు యూట్యూబ్‌‌‌‌లో ఆమె వీడియోలు చూసినవాళ్లు కూడా అదే మాట అంటున్నారు. అంతేకాదు.. ఆమె పేరులో రాణి ఉండడంతో ప్రేమగా ‘కుకింగ్‌‌‌‌ క్వీన్‌‌‌‌’ అని కూడా పొగుడుతున్నారు.  

మనవళ్ల సాయంతో..

పుష్పరాణి సోషల్‌‌‌‌ మీడియా జర్నీ 2017లో మొదలైంది. ఆమె మనవడు సుదీప్ సర్కార్ చిన్నప్పటినుంచి పుష్పరాణి చేసిన వంటకాలంటే ఇష్టం. అతను పుష్పరాణి చేసే బెంగాలీ సంప్రదాయ వంటకాలు కోల్‌‌‌‌కతాలోని రెస్టారెంట్లలో కూడా అందుబాటులో లేవని తెలుసుకున్నాడు. అందుకే వాటిని అందరికీ పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

 యూట్యూబ్‌‌‌‌లో కుకింగ్‌‌‌‌ వీడియోలకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి, 2017లో ‘విల్‌‌‌‌ ఫుడ్‌‌‌‌’ పేరుతో చానెల్‌‌‌‌ పెట్టాడు. వాళ్ల అమ్మమ్మ గుమ్మడి పూల బజ్జీలు(కుమ్రో ఫూలర్ బోరా) చేస్తుండగా వీడియో తీసి, దాన్ని యూట్యూబ్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. అదే చానెల్‌‌‌‌లో మొదటి వీడియో. ఆ తర్వాత కొన్ని రోజులకు చానెల్‌‌‌‌కు ఆదరణ పెరిగింది. విల్‌‌‌‌ఫుడ్ ఒక సంచలనంగా మారింది. 

ఫ్యామిలీ సపోర్ట్‌‌‌‌

పుష్పరాణి సక్సెస్‌‌‌‌ వెనుక ఆమె కుటుంబం కృషి కూడా ఎంతో ఉంది. వంట చేయడంలో ఆమె కోడలు కబితా, మనవరాలు సాయం చేస్తుంటారు. మనవడు సుదీప్‌‌‌‌ వీడియో తీసి, ఎడిటింగ్‌‌‌‌ చేసి యూట్యూబ్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తుంటాడు. ప్రస్తుతం చానెల్‌‌‌‌ ద్వారా ఏటా 8–12 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. అందులో నుంచి కొంత మొత్తాన్ని పేదల కోసం ఖర్చుచేస్తున్నారు. 

►ALSO READ | ఇదెక్కడి వింత బ్రో.. వధూవరులు లేకుండానే వివాహం..!

2020లో విల్‌‌‌‌ఫుడ్ చానెల్‌‌‌‌కు గోల్డ్ ప్లే బటన్‌‌‌‌ వచ్చింది. అప్పుడామె చుట్టుపక్కల ఆదివాసీ గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఫుడ్ డొనేషన్ చేసింది. ఇప్పుడు కూడా ‘విల్‌‌‌‌ఫుడ్ కిచెన్‌‌‌‌’ పేరుతో అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడి సంతాలి గిరిజన పిల్లలకు సాయం అందిస్తున్నారు. వాళ్ల వీడియోలు చూసేవాళ్లను కూడా తమ సామాజిక కార్యక్రమాల్లో భాగమయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. 

25 వీడియోల తర్వాత

విల్‌‌‌‌ఫుడ్ చానెల్ పెట్టిన కొత్తలో పెద్దగా వ్యూస్‌‌‌‌ రాలేదు. కానీ.. 25 వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసిన తర్వాత ప్రతిరోజూ కనీసం 100 వ్యూస్‌‌‌‌ వచ్చేవి. అలా 2021 నాటికి ఛానెల్ 1.5 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్లను సాధించింది. 2025 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగి 2.71 మిలియన్లకు చేరింది. చానెల్‌‌‌‌లో ఇప్పటివరకు 1,762 వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశారు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ వీడియోలను ఇండియా నుంచే కాకుండా అమెరికా, జపాన్, జర్మనీ, కెనడా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌‌‌‌, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుంచి కూడా ఎంతో మంది చూస్తున్నారు. 

పుష్పరాణి ‘కోరార్ కోఫ్తా’ వండిన ఒక వీడియోకు ఏకంగా 70 మిలియన్ల వ్యూస్‌‌‌‌ వచ్చాయి. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో కూడా పుష్పరాణికి మంచి ఫాలోయింగ్‌‌‌‌ ఉంది. విల్‌‌‌‌ఫుడ్‌‌‌‌ పేస్‌‌‌‌బుక్‌‌‌‌ పేజీని దాదాపు 2.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 

ఓపెన్ కిచెన్‌‌‌‌

విల్‌‌‌‌ఫుడ్ ఛానెల్‌‌‌‌లోని వీడియోలు పూర్తిగా గ్రామీణ వాతావరణంలోనే తీస్తారు. పుష్పరాణి స్థానికంగా దొరికే కూరగాయలు, చేపలతోనే ఎక్కువ వంటలు చేస్తుంటుంది. వీడియోల్లో గ్రామీణ బెంగాలీ జీవితం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. మట్టితో కట్టి, గడ్డి పైకప్పు వేసిన ఒక చిన్న పాకలో, లేదంటే పొలం దగ్గర వంటలు చేస్తుంటుంది. ఇప్పటికీ సంప్రదాయ మట్టి పొయ్యినే వాడుతుంటుంది. 

ఇంటి దగ్గర్లోని తోటలో పెంచుకున్న తాజా కూరగాయలు, ఆకుకూరలు, హెర్బ్స్‌‌‌‌ని అప్పటికప్పుడే కోసుకొచ్చి వంట చేస్తుంటుంది. పచ్చి అరటిపండు కోఫ్తా, డుమురేర్ ఘంటో(అంజీర్‌‌ కర్రీ), కుమ్రో ఫూలర్ బోరా (గుమ్మడి పూల బజ్జీలు), ఇలిషా భాపా (స్టీమ్డ్ హిల్సా) లాంటి ఎన్నో ఈనాటి తరం మరిచిపోయిన అరుదైన రెసిపీలను మళ్లీ పరిచయం చేసింది. షిల్-నోరా (గ్రైండ్‌‌‌‌స్టోన్)పై మసాలాలు రుబ్బుకోవడం, మట్టి కుండల్లో వంట చేయడం ఆ పాత మధురాలను గుర్తుచేస్తుంటాయి. 

అర్థమైపోతుంది

పుష్పరాణి వంట చేసే పద్ధతి అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఆమె మాట్లాడే భాష అర్థం కాని వాళ్లకు కూడా వంట ఎలా చేయాలో తెలిసిపోతుంది. అందుకే చానెల్‌‌‌‌కు ఇంతలా రీచ్‌‌‌‌ పెరిగింది. పైగా అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రిడియెంట్స్‌‌‌‌ని మాత్రమే వంటల్లో వాడుతుంది. చాలామంది ఆమెని ప్రేమగా ‘‘తమ్మ”(అమ్మమ్మ) అని పిలుస్తుంటారు. ఆమె చానెల్ బెంగాలీ పాక సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందిస్తుందని కామెంట్లు పెడుతుంటారు.