ODI World Cup 2023: బీసీసీఐ పెద్దల బుర్రలే.. బుర్రలు: సగం మ్యాచ్‌లు జరిగాక ఓపెనింగ్ సెర్మనీ!

ODI World Cup 2023: బీసీసీఐ పెద్దల బుర్రలే.. బుర్రలు: సగం మ్యాచ్‌లు జరిగాక ఓపెనింగ్ సెర్మనీ!

క్యాష్ రిచ్ లీగ్ 'ఐపీఎల్' ప్రారంభ వేడుకలు అంబరాన్ని అంటేలా నిర్వహించే బీసీసీఐ.. వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీని మాత్రం ఎలాంటి ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ప్రారంభించనుందట. అందుతున్న నివేదికల ప్రకారం.. ఓపెనింగ్ సెర్మనీకి బదులుగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ముందు కానీ లేదా క్లోజింగ్ సెర్మనీ వేడుకలు కానీ ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ వార్తలు క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నాయి.  

అక్టోబర్ 5న తొలి మ్యాచ్

వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 5న అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దీనికి ఒక రోజు ముందే అంటే బుధవారం (అక్టోబర్ 4) ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని అనుకున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు రణ్‌వీర్ సింగ్, అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, ఆశా భోంస్లేలాంటి వాళ్లు పర్ఫామ్ చేయబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. చివరకు ఇదంతా వట్టిదే అని తేలిపోయింది.

ALSO READ: ODI World Cup 2023: భారత జట్టును వెంటాడుతున్న వర్షం.. వరుసగా రెండో మ్యాచ్ రద్దు
 

కెప్టెన్స్ డే

ఓపెనింగ్ సెర్మనీ రద్దయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు స్పందించారు. కెప్టెన్స్ డే మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరగనున్నట్లు తెలిపారు. ఈ కెప్టెన్స్ డే కోసం వరల్డ్ కప్ లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు బుధవారం అహ్మదాబాద్ రానున్నారు.

ఏ టోర్నీ అయినా ప్రారంభమయ్యే రోజే ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. కానీ, బీసీసీఐ పెద్దల ఆలోచనలు క్రికెట్ అభిమానులకు అంతుపట్టడం లేదు. సగం మ్యాచ్‌లు జరిగాక ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐ పెద్దల బుర్రలపై వాళ్ళు పొగడతలు కురిపిస్తున్నారు. ఇండియా- పాక్ మ్యాచ్(అక్టోబర్ 14) రోజు పలువురు రాజకీయ నేతలు హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో అదే రోజు ప్రారంభ వేడుకలు ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.