హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు భారీగా గంజాయిని తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు హాష్ ఆయిల్, నిషేధిత దగ్గు మందు బాటిళ్లు, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
గురుదాస్ రంజన్ అనే వ్యక్తి ఒడిశా నుంచి కారులో 3,800 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ వద్ద ఇద్దరికి సరఫరా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ ‘ఎ’ టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సైలు శ్రీనివాస్, వరదభూపాల్ అతడిని పట్టుకున్నారు. గురుదాస్ రంజన్, ఎండీ సైపుల్లా ఖాన్, మదర్సర్ ను అరెస్ట్ చేసి కారు, బైక్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సరూర్‌నగర్‌లో డ్రగ్స్..
మరో ఘటనలో గుంటూరు నుంచి హాష్ ఆయిల్ తీసుకువచ్చి సరూర్‌నగర్ ప్రాంతంలో విక్రయిస్తున్న శశాంక్‌ను రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ‘బి’ గ్రూప్ సీఐ సుభాష్ చందర్, ఎస్సై నిఖిల్ పట్టుకున్నారు. 45 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
బడంగ్పేట్ గుర్రంగూడలోని మెడికల్ షాపులో 25 బాటిళ్ల నిషేధిత దగ్గు మందును డ్రగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పహాడ్ షరీఫ్ వద్ద ఎస్టీఎఫ్ఏ టీమ్ వాహనాల తనిఖీల్లో 70 నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను గుర్తించింది. వీటిని ఢిల్లీ, గోవా నుంచి విమానాల ద్వారా తెచ్చి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
