ఎస్ఈబీసీ జాబితాలోకి 22 కులాలు

ఎస్ఈబీసీ  జాబితాలోకి 22 కులాలు

రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల జాబితాలో 22 కులాలను చేర్చేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 22 వెనుకబడిన కులాలను ఈ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1993 ఎస్ఈబీసీ (SEBC) చట్టాన్ని సవరించింది. తాజా చేరికతో జాబితాలోని మొత్తం వెనుకబడిన కులాల సంఖ్య ఇప్పుడు 230కి చేరుకుంది. కొత్తగా చేర్చబడిన 22 వెనుకబడిన కులాలు కేంద్రం యొక్క ఓబీసీ జాబితాలో ఉన్నప్పటికీ, వారు రాష్ట్రంలోని SEBCలో లేకపోవడంతో వివిధ ప్రభుత్వ పథకాలు, సౌకర్యాలను కోల్పోయారు. 

గణనీయమైన రాజకీయ పరిణామాలతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రెండేళ్ల క్రితం ప్రకటన చేసినా వెనుకబడిన తరగతుల కోసం సర్వే చేయలేదని ప్రతిపక్ష బీజేపీ అధికార పక్షంపై మండిపడింది.  సర్వేలో జాప్యం చేసి లబ్ధిదారులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా చేశారని మండిపడ్డారు.