పూరీలో దారుణం..బాలికను సజీవ దహనం చేసిన దుర్మార్గులు

పూరీలో దారుణం..బాలికను సజీవ దహనం చేసిన దుర్మార్గులు
  • పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్​ చేసి నిప్పు పెట్టిన యువకులు
  • ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు
  • సీరియస్​గానే ఉందన్న వైద్యులు
  • ఫ్రెండ్‌‌ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా దారుణం

భువనేశ్వర్‌‌‌‌: ఒడిశాలోని పూరి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. గుర్తుతెలియని యువకులు కొందరు ఓ బాలికను కిడ్నాప్ చేసి సజీవ దహనం చేశారు. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి తిరిగొస్తున్న బాలికను బైక్​పై ఎత్తుకెళ్లారు. ఊరవతలికి తీసుకెళ్లి బాలికపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. పూరి జిల్లాలోని బలంగాలో జరిగింది. 70 శాతం కాలిన గాయాలతో ఆ బాలిక భువనేశ్వర్‌‌‌‌ ఎయిమ్స్‌‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్నా.. పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని బయాబర్‌‌‌‌ గ్రామానికి చెందిన బాలిక తన ఫ్రెండ్‌‌ను కలవడానికి శనివారం వెళ్లింది. ఉదయం 9 గంటల సమయంలో తిరిగి వస్తుండగా ముగ్గురు గుర్తుతెలియని యువకులు బాలికను బలవంతంగా బైక్‌‌పై ఎక్కించుకొని భార్గవి నది పరిసర ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతం ఆమెపై పెట్రోల్‌‌ పోసి, నిప్పంటించారు. 

తర్వాత ఆ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. నది ప్రాంతంలో దట్టమైన పొగను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని, మంటల్లో కాలిపోతున్న బాలికను కాపాడి హాస్పిటల్‌‌కు తరలించారు. బాలిక ఇంటికి 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. భువనేశ్వర్ ఎయిమ్స్‌‌లో 14 మంది డాక్టర్లతో ఓ టీమ్‌‌ను ఏర్పాటుచేసి, బాలికను ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తున్నారు. 

తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. చట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలికపై జరిగిన దారుణ ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. మహిళలకు ఒడిశా రాష్ట్రం సురక్షింతం కాదన్నారు. బాలిక ట్రీట్‌‌మెంట్‌‌కు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పారిడా తెలిపారు. 

వీలైనంత తొందరగా నిందితులను అరెస్ట్‌‌ చేస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై బీజేడీ చీఫ్‌‌, మాజీ సీఎం నవీన్‌‌ పట్నాయక్‌‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని సూచిస్తున్నాయని మండిపడ్డారు.