రైతులు విన్నారా : పారాక్వాట్ చాలా విషం.. ఈ మందును బ్యాన్ చేయండి

రైతులు విన్నారా : పారాక్వాట్ చాలా విషం.. ఈ మందును బ్యాన్ చేయండి

పారాక్వాట్.. రైతులకు తెలిసిన పురుగు మందు.. ఇది మన భూముల్లో కలుపు నివారణ కోసం ఉపయోగిస్తుంటారు రైతులు. ఈ మందు అత్యంత విషం అని చాలా విషపూరితంగా ఉంటుందని.. దీని వల్ల రైతులు చనిపోతున్నారని.. వెంటనే బ్యాన్ చేయాలంటూ ఒడిశా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పారాక్వాట్ మందు వల్ల ఎంత నష్టం.. మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే పూర్తి వివరాలతో కూడిన నివేదికను సైతం కేంద్రానికి అందజేసింది ఒడిశా సర్కార్. ఆ విషయాలు ఏంటో చూద్దాం..

ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (OUAT) నివేదిక ప్రకారం..  పారాక్వాట్, దాని ఉత్పన్నాలు అత్యంత విషపూరిత రసాయనం.. మనిషి శరీరంపై పారాక్వాట్  ప్రభావం చాలా ప్రాణాంతకం. సెప్టెంబర్ 2017 నుంచి  ఆగస్టు 2019 వరకు పారాక్వాట్ దుష్ప్రభావాల కారణంగా ఆసుపత్రిలో చేరిన 149 మంది పేషెంట్స్ లో  140 మంది మరణించారని ప్రముఖ వైద్య కళాశాల VIMSAR, బుర్లా ప్రత్యేక నివేదికలో నివేదించింది. ఈ క్రమంలో ఆ మందును నిషేదించాలని  ఒడిశా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరబింద పాధీ  కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు .

 పారాక్వాట్ వాడకం వల్ల కిడ్నీలు, కాలేయంపై తీవ్ర ప్రభావం పడిందని విమ్స్‌ఆర్‌ నివేదికలో తెలిపిందని వెల్లడించారు. దీని వల్ల  కొంతమంది రోగులకు తీవ్రమైన శ్వాస సమస్యలు ఉన్నాయని తెలిపారు.  ఈ మేరకు   పారాక్వాట్ తయారీ, పంపిణీ, అమ్మకం, వాడకంపై పూర్తి నిషేధం విధించాలన్నారు. క్రిమిసంహారక చట్టం, 1968లోని సెక్షన్ 27 (2) ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ఒడిశా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ అరబింద పాధీ.