కాలేజ్‌ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థులు తినే భోజనంలో కప్ప!

కాలేజ్‌ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థులు తినే భోజనంలో కప్ప!

కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు పడే తిప్పలు అన్నీఇన్నీ కాదు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో హాస్టల్ నిర్వాహకులకు ఉండే శ్రద్ధ వారికి అందించే భోజనంలో మాత్రం ఉండదు. అసలే నాసిరకం భోజనం పెడుతుంటారు. ఆపై అప్పుడప్పుడు భోజనంలో పురుగులు పడినా పట్టించుకోరు.

తాజాగా, ఒడిశాలోని కళింగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ-భువనేశ్వర్ కు చెందిన ఓ విద్యార్థి తమ హాస్టల్ భోజనంలో చచ్చిన కప్పను గుర్తించాడు. డబ్బులు తీసుకోవడంపై మన కాలేజీలకు ఉండే శ్రద్ధ మంచి సౌకర్యాలు అందించడంలో ఉండదని, అందుకే విదేశాలకు మన విద్యార్థులు వెళ్తున్నారని అన్నాడు. కేఐఐటీ భువనేశ్వర్ విద్యార్థి ఆర్యాన్ష్ తనకు ఎదురైన అనుభవాన్ని ట్విటర్ లో వివరించాడు. ఇది కేఐఐటీ భువనేశ్వర్. దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కాలేజ్ ది 42వ ర్యాంక్‌. తల్లిదండ్రులు దాదాపు రూ.17.5 లక్షలు చెల్లించి ఇంజనీరింగ్ డిగ్రీ కోసం తమ పిల్లలను చేర్పిస్తారు.అంత తీసుకుని కాలేజీ హాస్టల్‌లో ఇటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు.

 మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. మెరుగైన విద్య, సౌకర్యాల కోసం దేశం నుంచి విద్యార్థులు విదేశాలకు ఎందుకు వలస వెళతారని మనం ఆశ్చర్యపోతుంటాం అని ఆర్యాన్ష్ ఆవేదన వ్యక్తం చేశాడు. భోజనం కప్ప కనపడిన ఫొటోను అతడు పోస్ట్ చేశాడు. అతడు ఈ పోస్టు చేసిన కొన్ని గంటలకే కాలేజీ స్పందించింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని కూడా ఆ విద్యార్థి పోస్ట్ చేశాడు. హాస్టల్ నిర్వాహకులకు ఇచ్చే ఒక్క రోజు చెల్లింపులను కట్ చేస్తున్నట్లు కాలేజీ సర్క్యూలర్ జారీ చేసినట్లు అందులో ఉంది. కేవలం ఒక్క రోజు పేమెంట్ ను మాత్రమే కట్ చేస్తూ తమ వర్సిటీ స్పందించిన తీరుపై ఆర్యాన్ష్ మండిపడ్డాడు. వర్సిటీ పరువును కాపాడుకోవడానికే ఈ చర్య తీసుకుందని అన్నాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు  ఇలాంటి జరగటం కొత్తేమీ కాదు.. ప్రతీ హాస్టల్‌లో ఏదో ఒక సమయంలో ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి.  అంత డబ్బులు పెట్టి చదివిస్తే.. కొంచెం కూడా శుభ్రత ఉండదు. పిల్లల గురించి పట్టించుకునే నాథుడే ఉండడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటనపై కాలేజీ యజమాన్యం స్పందించింది. సంఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు