బ్రేకింగ్: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ముగ్గురు రైల్వే ఉద్యోగులు అరెస్ట్

బ్రేకింగ్: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ముగ్గురు రైల్వే ఉద్యోగులు అరెస్ట్

ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న రైలు విషాదఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 275 మంది మృతిచెందగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనను దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ).. తాజాగా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసింది.

అరెస్టైన ముగ్గురు ఉద్యోగులను సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌గా గుర్తించారు. వీరిపై సెక్షన్‌ 304, 201 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశారు. హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరపూరిత ఘటనలకు పాల్పడినట్లు సీబీఐ వారిపై ఆరోపణలు మోపింది.

బాలాసోర్ రైలు ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కమీషనర్ రైల్వే సేఫ్టీ(సీఆర్ ఎస్) నివేదిక తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, అత్యంత కీలకమైన 'ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ'లో మార్పులు చేయడమే ఈ దుర్ఘటనకు కారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రాథమికంగా వెల్లడించారు.