ఒడిశా కార్మికులు ఫైన్ కట్టలేదని చెత్త ఏరించిన్రు !

ఒడిశా కార్మికులు ఫైన్ కట్టలేదని చెత్త ఏరించిన్రు !
  •     సానిటరీ ఇన్​స్పెక్టర్​పై ఫిర్యాదు
  •     కొంతమంది జోక్యంతో వాపస్​ 
  •     సిద్దిపేటలో ఘటన

సిద్దిపేట, వెలుగు:  ఇంటి ముందు చెత్త వేశారని పెనాల్టీ వేయగా, అది కట్టలేదని ఏకంగా 20 మంది కార్మికులతో సిద్దిపేట మున్సిపల్​ అధికారులు మంగళవారం పొదలు కొట్టించి, చెత్త ఏరించారు. సిద్దిపేట మున్సిపల్​పరిధిలోని ముస్తాబాద్ రోడ్డులోని ఒక బార్ లో పనిచేసే ఒడిశా కార్మికుల ఇండ్ల చుట్టూ చెత్త పేరుకుపోయింది. ‘నడుస్తూ చెత్త ఏరుదాం’ కార్యక్రమంలో భాగంగా కమిషనర్​ దీన్ని గమనించి సదరు వ్యక్తుల నుంచి జరిమాన వసూలు చేయాలని సానిటరీ ఇన్​స్పెక్టర్​ వనితను ఆదేశించారు. దీంతో ఆమె ఒడిశా కార్మికుల నుంచి ఫైన్​వసూలు చేసే ప్రయత్నం చేయగా తాము రోజు వారీ కూలీలమని, రోజంతా బార్ లో పనిచేసే తమకు ఇండ్ల ముందు చెత్త ఎలా వచ్చిందో తెలియదని సమాధానమిచ్చారు. జరిమానా చెల్లించలేమని స్పష్టం చేశారు.  జరిమాన కట్టకపోతే స్వచ్ఛ బడి క్లాసులకు హాజరు కావాలని కోరింది. 

20 మంది కార్మికులను మున్సిపల్ ​వాహనంలో బురుజు సమీపంలోని స్వచ్ఛబడికి తీసుకువెళ్లి పాఠాలు చెప్పించింది. తర్వాత వారికి మున్సిపల్​సిబ్బందికి తొడిగే యాఫ్రాన్స్ వేయించి  సమీప ప్రాంతంలోని పొదలను తొలగింపజేసింది. వారితో చెత్తను ఏరివేయించింది. దీంతో  మనస్తాపానికి గురైన కార్మికులు సిద్దిపేట వన్ టౌన్ పీఎస్​లో సానిటరీ ఇన్​స్పెక్టర్​పై ఫిర్యాదు చేశారు. దీనిపై వనితను వివరణ కోరగా స్వచ్ఛ బడిలో కార్మికులకు క్లాస్ లు నిర్వహించామని, పొదల తొలగింపు, చెత్తను వారే స్వచ్ఛందంగా ఏరివేశారని  చెప్పారు. తమకు ఫిర్యాదు వచ్చింది నిజమేనని వన్ టౌన్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కాగా, కొంతమంది జోక్యంతో కార్మికులు తమ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.