పంజాబ్​లో రోడ్డెక్కని బస్సులు

పంజాబ్​లో రోడ్డెక్కని బస్సులు
  •  హైవేలను దిగ్బంధించిన రైతులు 
  • ‘భారత్ బంద్’తో మూతపడ్డ స్కూళ్లు

అమృత్​సర్/ హిసార్/ ముజఫర్​నగర్: సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేయూ) ఇచ్చిన ‘భారత్ బంద్’ పిలుపుతో శుక్రవారం పంజాబ్​లో బస్సులు రోడ్డెక్కలేదు. వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేశారు. నేషనల్ హైవేలను దిగ్బంధించారు. పఠాన్ కోట్, బఠిండా, జలంధర్ తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారులపై ధర్నా చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘మాకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలేదు. మేం మా హక్కుల కోసం పోరాడుతున్నాం” అని బీకేయూ లీడర్ హర్బన్స్ సింగ్ పేర్కొన్నారు. 

రైతులకు మద్దతుగా పంజాబ్​లోని ప్రైవేట్ బస్ ఆపరేటర్లు కూడా సర్వీసులను నడపలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్కేయూ ‘భారత్ బంద్’ పిలుపుతో చాలాచోట్ల విద్యాసంస్థలు, షాపులు, మార్కెట్లను స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే ఫిరోజ్ పూర్ బోసిపోయి కనిపించింది. ఈ కష్టకాలంలో రైతులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకే షాప్స్ బంద్ చేశామని సబ్జీ మండీ అసోసియేషన్ తెలిపింది. 10, 12వ తరగతులకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని.. మిగతా అన్ని తరగతులకు సెలవు ఇచ్చామని స్కూల్స్ అసోసియేషన్ పేర్కొంది. 

హర్యానాలోనూ.. 

‘భారత్ బంద్’ తో హర్యానాలోనూ కొన్నిచోట్ల బస్సులు నడవలేదు. హిసార్​లో ఉద్యోగులు రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చారు. కురుక్షేత్రలో బస్సులు నడిచాయి. షాప్స్, మార్కెట్లు ఓపెన్ చేశారు. యూపీలోని ముజఫర్ నగర్​లో జరిగిన నిరసన కార్యక్రమంలో బీకేయూ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ పాల్గొన్నారు.