అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలు

అసంపూర్తిగా  ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలు
  • దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలో నాలుగేండ్ల కింద ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్​ఆఫీస్​ కాంప్లెక్స్​ పనులు 
  • నిధుల కొరతతో ఇప్పటికీ కంప్లీట్​కాని భవనాలు
  • రోజురోజుకూ పెరిగిపోతున్న అంచనా వ్యయం

 సిద్దిపేట, వెలుగు : ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని ఒకే చోట  అందుబాటులో ఉండేలా మండల కేంద్రాల్లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలో నాలుగేండ్ల కింద దాదాపు రూ.51 కోట్లతో ఆఫీస్​ కాంప్లెక్స్​ల నిర్మాణాలు  ప్రారంభమయ్యాయి. కానీ నిధుల కొరతతోపాటు, వివిధ కారణాలతో ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఒక్కో కాంప్లెక్స్​ ను రూ.17 కోట్లతో నిర్మించాలని నిర్ణయించినా ఆలస్యం కావడంతో ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో మరో రూ.10 కోట్లు అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు. 

ఇదీ.. పరిస్థితి.. 

  •  దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రాయసముద్రం సమీపంలో నాలుగెకరాల విస్తీర్ణంలో  18 ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండేందుకు రూ.18 కోట్లతో 2018 జూన్ లో జీ ప్లస్ టూ పద్ధతిలో ప్రారంభించారు. పునాదుల దశలోనే నేల గట్టిగా లేదనే విషయం తెలిసింది.  స్థల ఎంపికలో లోపం జరిగిందని అధికారులు గుర్తించే సరికి ఏడాది కాలం గడిచిపోయింది.  తరువాత డిజైన్ మార్చారు.  12  ఫీట్ల లోతు నుంచి చేపట్టిన పునాది పనులకే  దాదాపు రూ.6 కోట్లు ఖర్చయ్యాయి. తరువాత మొదటి అంతస్థు స్లాబ్ పనులతో పాటు రెండో అంతస్తు పిల్లర్ల పనులు పూర్తయ్యేసరికి మొత్తం రూ.13 కోట్లు అయిపోనట్లు ఏఈ రిజ్వాన్​ తెలిపారు. పనులు పూర్తి కావాలంటే ఇంకా రూ.10 కోట్లు అవసరమవుతాయి. ఇదిలా ఉండగా దుబ్బాక ఐఓసీ పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవల జడ్పీ సమావేశంలో అధికారులను నిలదీశారు. పనుల ఆలస్యంపై దుబ్బాక  పీఆర్ ఏఈ రిజ్వాన్ అహ్మద్  మాట్లాడుతూ డిజైన్ల మార్పు కారణంగా నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. పూర్తి నిర్మాణానికి అదనంగా మరో 10 కోట్ల నిధులుమంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. త్వరలోనే పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.  
  • చేర్యాలలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులను 2018 ఫిబ్రవరి 2న  మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్స్ 17 కోట్లతో 18 ప్రభుత్వ కార్యాలయాను ఒకే చోట చేర్చడం కోసం పనులు చేపట్టారు. మొదట కాంట్రాక్టర్​ కొన్ని పనులు చేసి అర్ధాంతరంగా వైదొలగడంతో పనులు ఆగిపోయాయి. పనులను ప్రారంభించిన రెండేళ్ల లోపే పూర్తి చేస్తామన్న అధికారులు ఇక్కడ రెండేండ్లుగా ఒక్క పని జరగకున్నా పట్టించుకోవడం  లేడు. ఈ విషయంపై చేర్యాల పీఆర్ ఏఈ డి.శివకుమార్ మాట్లాడుతూ ఇటీవలే పనులను కొత్త కాంట్రాక్టర్​కు అప్పగించామని, రెండు, మూడు రోజుల్లోనే పనులు తిరిగి ప్రారంభిస్తామన్నారు. 
  • హుస్నాబాద్ మండలం గాంధీనగర్ లో  నాలుగేండ్ల కింద ప్రారంభమైన కాంప్లెక్స్​ నిర్మాణ పనులు కరోనా తరువాత స్లోగా జరుగుతున్నాయి. 17 ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు  రూ.17 కోట్లతో ఈ కాంప్లెక్స్​ను నిర్మిస్తున్నారు. ఇప్పటికీ మూడు స్లాబ్ లతో పాటు గోడల నిర్మాణం పూర్తయినా ప్లాస్టరింగ్, ఫర్నిచర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ పనులు జరగాల్సి ఉంది. పెండింగ్ పనులు కంప్లీట్ కావాలంటే మరిన్ని నిధులు అవసరమయ్యే పరిస్థితి ఉందని అధికారులు  చెబుతున్నారు.