డబుల్​ ఇండ్లు ఇచ్చేందుకు చేతులు రావట్లే!

డబుల్​ ఇండ్లు ఇచ్చేందుకు చేతులు రావట్లే!
  • నాలుగైదు నెలల కిందే 64,418 ఇండ్ల నిర్మాణం పూర్తి
  • పూర్తయిన వాటికి కాపలా ఉండలేమంటున్న బిల్డర్లు
  • సెక్యూరిటీ ఖర్చు భరించలేమంటూ బల్దియా ఆఫీసర్లకు వినతులు
  • ఎప్పుడు ఇస్తారా అని లబ్ధిదారుల ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు:  పూర్తయిన డబుల్ బెడ్​రూమ్ ఇండ్లు పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు, మంత్రులకు చేతులు రావడం లేదు. గ్రేటర్​వ్యాప్తంగా జీహెచ్ఎంసీ 111 ప్రాంతాల్లో డబుల్​ఇండ్ల నిర్మాణం చేపట్టింది. 40 స్లమ్​ఏరియాల్లోని ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించింది. ఇప్పటికే 23 ప్రాంతాల్లో 5,319 ఇండ్లు పూర్తవగా వాటిలోని 4 వేల ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మిగిలిన ఇండ్లు అలానే ఉన్నాయి. అవి కాకుండా నాలుగైదు నెలల కింద మరో 64,418 ఇండ్ల నిర్మాణం పూర్తయినట్లు బల్దియాలోని ఇంజనీర్లు చెబుతున్నారు. కానీ వాటిని పంపిణీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్​ చేయట్లేదు. రెడీ అయిన ఇండ్లకు కాపలా కాయడం జీహెచ్ఎంసీకి పెద్ద తలనొప్పిగా మారింది. నిర్మించే వరకే తమ బాధ్యత అని బిల్డర్లు పక్కకు తప్పుకుంటున్నారు. కొందరిపై ఆఫీసర్లు ఒత్తిడి తీసుకొస్తుండటంతో సైట్లలో నామ్ కే వాస్తేగా ఇద్దరు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులను పెడుతున్నారు. వారిని ఉంచడం కూడా తమకు భారమేనని బిల్డర్లు వాపోతున్నారు. కొల్లూరు సైట్​లో పూర్తయిన 15,600 ఇండ్లకు కేవలం షిఫ్టుకు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉంటున్నారు. అన్ని సైట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. సెక్యూరిటీ లేకపోవడంతో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు బల్దియా దృష్టికి వచ్చింది. ఇలాంటి చోట గస్తీ ఏర్పాటు చేయాలని పోలీస్​ఆఫీసర్లకు జీహెచ్ఎంసీ లెటర్లు రాసినప్పటికీ ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం విభాగానికి చెందిన సిబ్బందిని కొన్ని ప్రాంతాల్లోనే కాపలాకు నియమించగా, సిబ్బంది లేనిచోట పూర్తయిన ఇండ్లలోని సామగ్రి చోరీకి గురవుతోంది.133 మంది సెక్యూరిటీ గార్డులను నియమించేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ పూర్తిస్థాయిలో నియమించలేదు.

ఇంకొన్ని నెలలు పట్టే చాన్స్

నిర్మాణం పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రాసెస్​ఇంకా పూర్తి కాలేదు. మరికొన్ని నెలలు పట్టేలా ఉంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొల్లూర్ సైట్​లో నిర్మించిన ఇండ్లను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్​ ప్రకటించి నెల దాటినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా రాలేదు. పూర్తయిన ఇండ్లను పంపిణీ చేసేందుకు ఎందుకు ఇంత లేట్​చేస్తున్నారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలు పూర్తయ్యామని ఎప్పటికప్పుడు మంత్రులు, ఆఫీసర్లు చెబుతూనే కేటాయించకపోవడం దారుణం అంటున్నారు.

రూ.350 కోట్లు తెచ్చి మరీ..

జీహెచ్ఎంసీలో నిధుల కొరతతో డబుల్​ఇండ్ల పనులు మధ్యలో ఆగిపోగా హడ్కో నుంచి రూ.350 కోట్లు రుణంగా తెచ్చి మరి పనులు చేశారు. కానీ ప్రస్తుతం నిర్మించిన సంస్థలే పూర్తయిన ఇండ్లకు కాపలా కాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు బిల్లులు ఆగిపోవటం, మరోవైపు కాలనీలకు కాపలా కాసేందుకు సెక్యూరిటీని సొంత ఖర్చులతో నియమించటం పట్ల పలు నిర్మాణ ఏజెన్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అంతా అయిపోయాక వృథాగా ఉంచితే ఎవరికి లాభమని ప్రశ్నిస్తున్నారు. స్థలాలు ఇచ్చినోళ్లు, ఇల్లు లేని పేదలు నెలనెలా అద్దెలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​స్పందించి త్వరగా పంపిణీ చేయాలని కోరుతున్నారు.