
- డివిజన్ల పునర్విభజన పై ఆఫీసర్ల కసరత్తు
- 2019లో బీఆర్ఎస్ లీడర్లకు అనుకూలంగా పునర్విభజన చేశారని ఆరోపణలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ల పునర్విభజనకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. సుమారు 5 వేల ఓటర్లకో డివిజన్ ను ఏర్పాటు చేయడంతోపాటు వాటి హద్దులను నిర్ధారిస్తూ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు మల్కాపూర్, చింతకుంట, బొమ్మకల్, దుర్శేడ్, గోపాలపూర్ గ్రామాలను ప్రభుత్వం విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో డివిజన్ల పునర్విభజన తప్పనిసరిగా మారింది.
అంతేగాక 2019లో జరిగిన 60 డివిజన్ల పునర్విభజనలో కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే కొందరు బీఆర్ఎస్ లీడర్లకు అనుకూలంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు వచ్చేలా ఆయా సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ ఉండేలా చూసుకుంటూ మార్చారనే విమర్శలు ఉన్నాయి. రోడ్డుకు ఒక వైపు డివిజన్, మరో వైపు ఇంకో డివిజన్ వచ్చేలా కాకుండా గజిబిజీగా చేయడంతో మున్సిపల్ సిబ్బందికి, ఆఫీసర్లకు కూడా రోజువారీ డ్యూటీలో ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే మొత్తం డివిజన్లను శాస్త్రీయంగా విభజించేందుకు మున్సిపల్ ఆఫీసర్లు డ్రాఫ్ట్ సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
డ్రాఫ్ట్ దశలో పునర్విభజన ప్రక్రియ..
ప్రస్తుతం నగరంతోపాటు విలీన మున్సిపాలిటీ, గ్రామాలను కలిపితే సుమారు మూడున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 60 డివిజన్లు ఉండగా.. ఈ డివిజన్లను 66 డివిజన్లుగా విభజించనున్నారు. ఇందుకోసం ముందుగా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో చర్చించి డివిజన్ల బౌండరీని నిర్ధారించినట్లు తెలిసింది. ఇప్పుడు ఉన్న ఓటర్ల సంఖ్య ప్రకారం ఒక్కో డివిజన్ లో 4,500 నుంచి 5 వేల మంది ఉండే చాన్స్ ఉంది.
డివిజన్ల పెంపుతో నగర స్వరూపం మారునుంది. డ్రాఫ్ట్ ను ఉన్నతాధికారులు పరిశీలించిన అనంతరం నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాలను పరిశీలించి చేర్పులు, మార్పుల తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. డివిజన్ల పునర్విభజన వల్ల గతంతో పోలిస్తే స్థానిక లీడర్లకు రాజకీయ అవకాశాలు చాలా వరకు తగ్గిపోనున్నాయి.
పునర్విభజన ఎలా?
డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న లీడర్లలో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి కలిసొస్తుందో.. ఎవరికి రాజకీయంగా ఇబ్బందవుతుందోనని లెక్కలేసుకుంటున్నారు. గతంలో లాగా కాకుండా ఇంటి నంబర్లు, రోడ్లను ఆధారంగా చేసుకుని ఒక క్రమపద్ధతిలో డివిజన్లను విభజించినట్లు తెలిసింది. ప్రస్తుతం కార్పొరేషన్ లో డివిజన్ల పునర్విభజనతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీని రెండు డివిజన్లుగా, అలాగే ఐదు విలీన గ్రామాలకు సమీపంలో ఉన్న నగరంలోని కాలనీలను కలుపుకొని డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.