శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు..

శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు..

సుదీర్ఘ విచారణ తరువాత హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి శివబాలకృష్ణను కష్టడీకి తీసుకోనున్నట్టు సమాచారం. ఇవాళ(గురువారం) శివ బాలకృష్ణకు చెందిన బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి మరికొన్ని ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.  

 నిన్న ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని నానక్ రామ్ గూడ లోని శివ బాలకృష్ణ ఇంటితో పాటు బంధువులు, స్నేహితులు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.  మొత్తం 14 ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేశారు. మణికొండ పుప్పాలగూడలోని ఇంట్లో  84 లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు. 15 లక్షలకు పైగా విలువ చేసే 40 కి పైగా వాచ్ లు, 20కి పైగా ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం చేసుకున్నారు. 

వీటితో పాటు 2  కిలోల బంగారం, కోట్ల రూపాయల విలువ చేసే 75 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. అన్నీ కలిపి  300 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చని అంచనా వేశారు అధికారులు.  శివ బాలకృష్ణ పై కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు ఏసీబీ అధికారులు.  శివబాలకృష్ణ HMDA లో 2018 నుంచి 23 వరకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు.

  ప్రస్తుతం రెరా సెక్రటరీగా ఉన్నాడు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ టైంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలామంది అధికారులతో కలిసి అవినీతి చేసినట్టు డిపార్ట్ మెంట్లో ప్రచారం జరిగింది. ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ప్రక్రియలో పెండింగ్ ఫైల్స్ అక్రమంగా క్లియర్ చేశాడని... ఇందుకోసం భారీగా డబ్బుతో పాటు... విలువైన భూములను తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడని ఆరోపణలున్నాయి.